ఏపీ ప్రభుత్వం ఆర్బీఐని ఏటీఎంలా వాడుకుంటోంది. ప్రతీ వారం వేల కోట్ల అప్పులు తీసుకొస్తోంది. అన్నేసి వేల కోట్లు అప్పులు తీసుకోవడానికి అర్హత లేకపోయినా దత్తపుత్రుడి లాగా జగన్ రెడ్డిని కేంద్రం ఆదరిస్తోంది. అయినా ఏపీలో ఉద్యోగులకు.. పెన్షనర్లకు సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదు. పన్నెండో తేదీ వచ్చినా ఇప్పటికీ 30 శాతం మందికి జీతాలు, పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి.
ఓ ఆరు నెలల కిందటి వరకూ ఆర్బీఐ నుంచి అప్పులు డ్రా చేసుకుంటే జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు అప్పులు తీసుకున్నా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోది. రాష్ట్ర ఆదాయం.. అప్పులు… మొత్తం ఏమవుతుందో తెలియని పరిస్థితి. జనవరిలోపు సన్నిహిత కాంట్రాక్టర్లకు పది వేల కోట్లు చెల్లించాలని గతంలో నిర్ణయించారు. అప్పులు తెచ్చి చెల్లిస్తున్నారేమో తెలియదు కానీ.. ఇప్పటికీ ఐర్బీఐ వద్ద నాలుగున్నర వేలకోట్ల వరకూ వేస్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్ పెండింగ్ ఉంది. ఇంత ఘోరమైన ఆర్థిక నిర్వహణ గతంలో ఎప్పుడూ లేదు. ప్రజల సొమ్ము ఎటు పోతోందో దిక్కు లేదు.
ఫిబ్రవరిలోనే ఎన్నికలు ఉంటాయని… వైసీపీ సర్కార్ గట్టిగా నమ్ముతోంది. అందుకే బడా కాంట్రాక్టర్లకు బిల్లులను వెంటనే చెల్లించేందుకు నిధులన్నీ సమీకరిస్తున్నారని చెబుతున్నారు. అసలు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనులే లేవు. ప్రాజెక్టులన్నీఎక్కడివక్కడ ఆగిపోయాయి. అయినా వేల కోట్ల బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారో వారికే తెలియాలి. మొత్తంగా ప్రజల సంపద మాత్రం .. లెక్కల్లేకుండా తరలిపోతోంది.