తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ రెండో తేదీతో రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న వారిలో వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్, జోగినపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.
ప్రస్తుతం శాసన సభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం దృష్ట్యా ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్ కు దక్కే అవకాశం ఉంది. వాటిలో ఒకటి ప్రొఫెసర్ కోదండరాం కు కేటాయిస్తారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు కరీంనగర్ లో ప్రొఫెసర్ కోదండరాం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బేషరతుగా మద్దతివ్వాలని.. గెలిచిన తర్వాత రాజ్యసభకు చాన్సిస్తామని రాహుల్ గాంధీ కోరారు. . దానికి కోదండరాం ఒప్పుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలతో కోదండరాం మొదటి నుంచి సన్నిహితంగా ఉన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటు తర్వాత కోదండరాంను కేసీఆర్ దూరం పెట్టారని చెబుతారు. ఇప్పుడు నేరుగా కాంగ్రెస్ తో కలిసి పని చేస్తున్నందున ఆయనకు రాజ్యసభ అవకాశం లభించనుంది. తెలంగాణ జేఏసీ నేతగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు పదవి వస్తే ఉద్యమకారులు కూడా సంతృప్తి చెందుతారని కాంగ్రెస్ భావిస్తోంది.