త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాక.. ప్రతీ రోజూ ఏదో ఓ రూపంలో మన్సూర్ అలీఖాన్ పేరు వినిపిస్తూనే ఉంది. త్రిషకి మన్సూర్ సారీ చెప్పడం, ఆ తరవాత త్రిష మన్సూర్‌ని వదిలేయ్యమంటూ పోలీసుల్ని కోరడం.. వీటన్నింటి తరవాత నిజానికి ఈ వ్యవహారానికి పుల్ స్టాప్ పడాలి. కానీ మన్సూర్ మాత్రం దీన్ని ఇంకా పట్టుకొని వేలాడుతూనే ఉన్నాడు. తాజాగా చిరంజీవి, ఖుష్బూ, త్రిషల లపై పరువు నష్టం దావా వేసి ఇంకాస్త రచ్చ చేయాలని చూశాడు మన్సూర్. ఈ పిటీషన్ సోమవారం చెన్నై కోర్టు ముందుకు వెళ్లింది.
చెన్నై కోర్టు కూడా.. ఈ వ్యవహారంలో మన్సూర్కే మొట్టి కాయలు వేసింది. నిజానికి మన్సూర్‌పై త్రిషనే ముందుగా కేసు ఫైలు చేస్తే బాగుండేదని పరోక్షంగా మన్సూర్‌కి మొట్టికాయలు వేసింది. యువకులకు రోల్ మోడల్ గా ఉండాల్సిన నటులు బహిరంగ ప్రదేశాల్లో ఏది పడితే అది మాట్లాడొచ్చా? అంటూ మన్సూర్‌ని ప్రశ్నించింది కోర్టు. తమకు ఏమీ తెలియదు అనుకొంటే అది పిటీషనర్ తప్పే అని హెచ్చరించింది. ఈ మేరకు వాదనల్ని ఈనెల 22కు వాయిదా వేసింది. అంతే కాదు.. చిరంజీవి, ఖుష్బూ, త్రిషలకు నోటీసులు జారీ చేసింది. మన్సూర్ వేసిన పరువు నష్టం దావాపై స్పందించాల్సిందిగా ఆదేశించింది.