తెలంగాణలో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా సిన్సియర్ గా పని చేసే పోలీస్ ఆఫీసర్స్ కుు మంచి రోజులు వచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. హోంశాఖను స్వయంగా చూసుకుంటున్న రేవంత్ రెడ్డి గ్రేటర్ పరిధిలో ముగ్గురు పోలీస్ కమిషనర్లను మార్చేశారు. హైదరాబాద్‌కు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్‌కు అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు సుధీర్ బాబును కమిషనర్లుగా నియమించారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి, సుధీర్ బాబు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అయినప్పటికీ చాలా కాలంగా లూప్ లైన్ పోస్టుల్లో ఉన్నారు.
ముఖ్యంగా హైదరాబాద్ సీపీగా నియమితులైన కొత్త కోట శ్రీనివాసరెడ్డి సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. కేసుల్లో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గరు. అందుకే అత్యధిక సార్లు ట్రాన్స్ ఫర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్‌గా చెబుతారు. ఆయన చాలా కాలంగా లూప్ లైన్ లో ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ చీఫ్ గా ఉన్న బొత్స సత్యనారాయణ లిక్కర్ సిండికేట్ స్కాంకు పాల్పడ్డారు. ఆ కేసును కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి డీల్ చేశారు. ఆ కేసు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తరించింది. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో.. శ్రీనివాసరెడ్డిని విచారణ పరిధి నుంచి బదిలీ చేయించారు. దాంతో ఆ కేసు కూడా మూలనపడిపోయింది. పోస్టింగ్ కోసం రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్లడం లేకపోతే ఉన్న పోస్టింగ్ లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం అనేది ఉండదని ఆయన గురించి డిపార్టుమెంట్ లో చెప్పకుంటున్నారు.
అలాంటి ఆఫీసర్ ను గుర్తించి.. రేవంత్ రెడ్డి సైబరాబాద్ సీపీని చేయడంతో.. పోలీసు వ్యవస్థ ప్రజలకు భరోసా ఇస్తుందన్న నమ్మకం ఏర్పడుతోంది. మరో వైపు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు అనకూలంగా పని చేయడం.. హైదరాబాద్ వైసీపీ నేతలకు కావాల్సినట్లుగా పోలీసింగ్ చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న స్టీఫెన్ రవీంద్రను డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేశారు.