2023 క్యాలెండర్ మార్చే సమయం దగ్గర పడింది. మరికొద్ది రోజుల్లో 2023 చరిత్రైపోతుంది. కొత్త ఆశలు, ఆశయాలతో 2024కి స్వాగతం పలకడానికి సిద్ధమౌతున్న తరుణమిది. అయితే భవిష్యత్ పై కొత్త ఆశలు చిగిరించేలా ఎప్పటికప్పుడు యువ ప్రతిభ సినిమాకి పరిచయమౌతూనే వుంది. 2023లో కూడా కొత్త దర్శకుడు కోటి ఆశలతో మెగాఫోన్ పట్టుకున్నారు. అందులో కొందరు దర్శకులు సత్తాని చాటారు, ఇంకొందరు తొలి ప్రయత్నంతో నిరాశపరిచినప్పటికీ భవిష్యత్ కు కావాల్సిన అనుభవాన్ని సంపాదించారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు వేణు. హాస్యనటుడిగా అందరికీ సుపరిచతమైన వేణు.. ‘బలగం’ సినిమాకి మెగా ఫోన్ పట్టాడు. ఈ సినిమాపై మొదట్లో ఎవరికీ అంచనాలు లేవు. చిన్న సినిమాగానే వచ్చింది. అయితే అందులో వున్న కంటెంట్ వైడ్ గా రీచ్ అయ్యింది. సహజమైన చిత్రీకరణ, తెలుగు మట్టికథ, భావోద్వేగాలు, మంచి సంగీతం.. ఇవన్నీ ‘బలగం’కు ప్రధాన బలంగా నిలిచాయి. పెద్దతారాబలం లేని ఈ చిత్రం కంటెంట్ బలంతో బాక్సాఫీసు వద్ద కూడా మంచి లాభాలు చూసింది. వేణుకి దర్శకుడిగా చాలా గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు వేణు, నాని లాంటి హీరోలకు కథను తయారూచేసే పనిలో వున్నారు.
నాని ‘దసరా’తో ఆకట్టుకున్నాడు శ్రీకాంత్ ఓదెల. అప్పటివరకూ నానిలో చూడని మాస్ కోణాన్ని పరిచయం చేశాడు. ఇది కూడా తెలంగాణ పల్లె కథే. తొలి సినిమాని ఒక సవాల్ గా తీసుకొని పాన్ ఇండియా స్థాయిలో సినిమాని మలిచాడు శ్రీకాంత్. ఈ సినిమా మిగతా భాషల్లో ఆశించినంత స్థాయిలో ఆడలేదు కానీ.. తెలుగులో మాత్రం సత్తా చాటింది. మాస్ ఎమోషన్స్ ని పట్టుకోవడంలో శ్రీకాంత్ ప్రతిభ కనిపించింది. పరిశ్రమలో కూడా తనపై గురి కుదిరింది. తను చేయబోయే రెండో సినిమా కూడా భారీ స్థాయిలో వుండేలా సన్నాహాలు చేసుకుంటున్నారు శ్రీకాంత్.
నాని ఈ ఏడాది మరో కొత్త దర్శకుడు శౌర్యువ్ కి ‘హాయ్ నాన్న’తో అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని చక్కగా వాడుకున్నాడు శౌర్యువ్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా హాయ్ నాన్నని మలిచి అందరి ప్రసంశలు అందుకున్నాడు. ప్రేక్షకుల అనుభవంలో వున్న కథే అయినప్పటికీ చక్కని సంగీతం, మనసుని హత్తుకునే ఎమోషన్స్ ని చిత్రీకరించడంలో దర్శకుడు చక్కని ప్రతిభ కనబరిచాడు. బాక్సాఫీసు వద్ద కూడా ఈ సినిమా చక్కగా రాణిస్తోంది. మొదటి సినిమాతోనే మంచి ఫీల్ గుడ్ మూవీ అందించిన శౌర్యువ్ కు అభినందనలు వెల్లువ కురుస్తోంది.
ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి మంచి వసూళ్లు రాబట్టిన చిత్రం మ్యాడ్. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్నాడు. కాలేజీ కుర్రాళ్ళ కథతో యూత్ ని కట్టిపడేసే వినోదం రాసుకొని తెరపై కూడా అంతే హుషారుగా చిత్రీకరించడం, హాయ్ గా నవ్వుకోవడానికి కావాల్సినంత వినోదం ‘మ్యాడ్’ తో ఇచ్చాడు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి లాభాలు చూసింది. వినోదంపై మంచి పట్టు వున్న దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ కు పేరు తెచ్చింది.
నాగశౌర్య రంగబలి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు పవన్ బాసంశెట్టి. ఇది కూడా మంచి వినోదాత్మక చిత్రమే. తొలి సగం చాలా హుషారుగా నడిపించాడు. అయితే రెండో సగంలో కథని చెప్పడంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. నిజానికి తొలి సగంలోని జోరుని చూస్తే నాగశౌర్య కి మరో విజయం చేరిందనే నమ్మకం కలిగింది. కానీ సెకండ్ హాఫ్ అనూహ్యంగా డ్రాఫ్ అయ్యింది. అయితే ఏదేమైనప్పటికీ పవన్ లో మంచి కమర్షియల్ ఎంటర్ టైన్మెంట్ టచ్ వుందని తొలి సినిమాతోనే అనిపించుకున్నాడు.
ఈ ఏడాది చిన్న సినిమాలతో ఆకట్టుకున్న దర్శకులు జాబితా కూడా బావుంది. సుమంత్ ప్రభాస్ దర్శకుడిగా నటుడిగా చేసిన ‘మేమ్ ఫేమస్’ ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. సుమంత్ ని మహేష్ బాబు పొగడ్తలతో ముంచెత్తడం, స్వయంగా తన బ్యానర్ లో సినిమా చేసే అవకాశం ఇస్తానని చెప్పడం వార్తల్లో ప్రత్యేకంగా నిలిచింది. అదే చాయ్ బిస్కెట్ నిర్మాణంలో వచ్చిన మరో చిత్రం రైటర్ పద్మభూషణ్ తో షణ్ముఖ ప్రశాంత్ దర్శకుడయ్యాడు. థియేట్రికల్ అనుభూతినే పంచే అంశాలు ఇందులో లేకపోయినప్పటికీ క్లీన్ ఎంటర్ టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
ఈ ఏడాది ఓ మహిళా దర్శకురాలు మెగాఫోన్ పట్టుకుంది. మార్టిన్ లూథర్ కింగ్ తో పూజకొల్లురు దర్శకురాలిగా పరిచయమైయింది. ఒరిజినల్ మండేలా ఆత్మ చెడిపోకుండా మార్టిన్ లూథర్ కింగ్ ని తెరకెక్కించిందని ప్రశంసలు అందుకుంది. అలాగే కార్తికేయ బెడురులంక సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచమయ్యాడు. సినిమా పెద్దగా రాణించలేదు కానీ దర్శకుడిగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలడనే నమ్మకం కలిగించాడు. అలాగే 7:11 PM అనే టైం ట్రావెల్ సినిమాతో వచ్చాడు చైతు మాదాల. చిన్న సినిమాతో పెద్దగా అనుభూతిని కలిగించే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నం ఫలించలేదు కానీ ప్రయత్నం మాత్రం మెచ్చుకునేలా వుంది.
ఇక ఏడాది తొలి ప్రయత్నంలో నిరాశ పరిచిన దర్శకులని పరిశీలిస్తే.. కిరణ్ అబ్బవరంతో మీటర్ సినిమా తీసిన కొత్త దర్శకుడు రమేష్ కదూరి ఒక్క సన్నివేశంలో కూడా కొత్తదనం లేకుండా ఆ సినిమాని మలిచాడు. అలాగే కిరణ్ అబ్బవరం మరో సినిమా ‘వినరోభాగ్యము’ దర్శకుడు మురళీ కిషోర్ కి అదే తొలి సినిమా. ఇది రొటీన్ గా లేదు కానీ కాన్సప్ట్ కిక్ ఇవ్వలేదు. కళ్యాణ్ రామ్ తో అమిగోస్ తీసిన రాజేందర్ రెడ్డి మెప్పించలేకపోయాడు. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా విజయం తర్వాత ఎడిటర్ గ్యారీ బిహెచ్ కి దర్శకత్వ అవకాశం ఇచ్చాడు నిఖిల్. అయితే ఈ సినిమా నిర్మాణ పరంగాకూడా డిజాస్టర్. అసలు పూర్తి సినిమా తీయకుండానే విడుదల చేశారనే వార్తలు వినిపించాయి. అలా ..గ్యారీ దర్శకుడిగా విఫలమయ్యాడు. కళ్యాణం కమనీయం తో అనిల్ కుమార్, నేను స్టూడెంట్ ని సర్ తో రాకీ ఉప్పలపాటి, చాంగురే బంగారు రాజాతో సతీష్ వర్మ, ఆది కేశవ శ్రీకాంత్ రెడ్డి.. ఇలా తమ తొలి ప్రయత్నంలో నిరాశపరిచారు. మొత్తానికి 2023 కొత్త దర్శకులకు మిశ్రమ ఫలితాల్ని ఇచ్చినప్పటికీ శ్రీకాంత్ ఓదెల, వేణు, కళ్యాణ్ శంకర్, శౌర్యువ్ లాంటి దర్శకులు మెరిశారు.