పీకే లేని ఐ ప్యాక్ స్ట్రాటజీలు వైసీపీ నేతల్ని వణికిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం బీహార్లో సొంత పార్టీ పెట్టుకున్నారు. కొన్నాళ్లు పాదయాత్ర చేశారు. గాయం కావడంతో ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ ఆయన మళ్లీ పొలిటికల్ స్ట్రాటజీస్ బాధ్యతలు తీసుకోవాలని అనుకోవడం లేదు. చిన్న మాట సాయం కూడా చేయడం లేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆయన శిష్యులే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి స్ట్రాటజిస్టుగా ఉన్నారు. రుషిరాజ్ అనే యూపీకి చెందిన వ్యక్తి స్ట్రాటజిస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే గ్రౌండ్ రియాలిటీ గురించి నివేదికలు సీఎం జగన్ కు చేరవేస్తున్నారు. అయితే సీఎం జగన్ ను సంతృప్తి పరిచేందుకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని.. వైఎస్ఆర్సీపీ నేతలు అనుమాన పడుతున్నారు. సీఎం జగన్ ఇటీవలి కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలే వారి అనుమానాలకు కారణం. వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీలన్నీ ఐ ప్యాక్ వే. చివరికి ఎక్కడ రోడ్లు వేయాలన్నది కూడా ఐ ప్యాక్ డిసైడ్ చేస్తుంది. నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో పర్యటనలు చేస్తోంది. రాష్ట్ర స్థాయి ప్రచార కార్యక్రమాలనూ రూపొందిస్తోంది.
ఆ సంస్థ రూపొందిన ఒక్క కార్యక్రమం పార్టీకి ప్లస్ కాలేదన్న భావనలో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో రెండేళ్ల కిందటే కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బయటకు తెలిసేలా చేశారన్న ఆగ్రహం పార్టీ నేతల్లో ఉంది. తర్వాత జగనన్న సురక్ష, జగనన్నకు చెబుతాం అంటూ పలు కార్యక్రమాలను హడావుడిగా ప్రారంభించారు. అవన్నీ ఎలా ప్రారంభమయ్యాయో అంతే వేగంగా ఆగిపోయాయి.
ఇప్పుడు పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందనిపించేలా ఇంచార్జుల్ని ఇష్టం వచ్చినట్లుగా మార్చుకుంటూ పోతున్నారు. ఇదంతా ఐ ప్యాక్ సలహాలే. పాత టీడీపీ కుటుంబాల నుంచి వారసుల్ని తీీసుకుని పార్టీ కోసం పని చేసిన వారిని … పక్కన పెట్టేయాలన్న కాన్సెప్ట్ అమలు చేస్తున్నారు. దీంతో వైసీపీలో పరిస్థితి దిగజారిపోతోంది.
మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఐ ప్యాక్ వైసీపీకి భారీ విజయాలు వస్తాయని నివేదికలు ఇచ్చింది. కానీ ఫలితాలు తేడా వచ్చాయి. ఆ సమయంలోనే సీఎం జగన్ ఈగోను శాటిస్ ఫైచేయడానికి గ్రౌండ్ రియాలిటీని ఐ ప్యాక్ చెప్పడం లేదని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఐ ప్యాక్ కే ఇచ్చారు. పార్టీ నేతల పనితీరు విషయంలో హైకమాండ్ కు ఐ ప్యాక్ తప్పుడు నివేదికలు పంపుతోందన్న ఆరోపణలు కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నాయి. ఐ ప్యాక్ పై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.