ప్రజాధనంతో సభలు పెట్టి రాజకీయ ప్రసంగాలు చేసే జగన్ రెడ్డి.. తనలో ఓటమి భయాన్ని బహిరంగంగానే బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ విషయంలో చాలా ఆందోళనకు గురవుతన్నారు. తన రాజకీయ జీవితాన్ని టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా పవన్ అంతం చేస్తున్నారని ఆందోళన చెందుతున్నారేమో కానీ .. బహిరంగంగా మాట్లాడాల్సి వస్తే పవన్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఉద్దానంలో పవన్ కల్యాణ్ చొరవతో.. గత ప్రభుత్వం నిర్మాణం ప్రారంభించిన మంచి నీటి ప్రాజెక్టు, ఆస్పత్రిని ఐదేళ్లలో పూర్తి చేయకపోగా.. ఇంకా నలభై శాతం పనులు పెండింగ్ లో ఉండగానే ప్రారంభించేశారు.
రుషికొండ మీద ఐదు వందల కోట్లతో విలాసవంతమైన ఇల్లు నెలల్లో కట్టేసుకున్న ఆయన… ఉద్దానం ప్రాజెక్టును మాత్రం పూర్తి చేయలేకపోయారు. అయినా బిల్డప్‌లు మాత్రం తగ్గడం లేదు. పైగా ఉద్దానం పోయి పవన్ కల్యాణ్ నే ఎక్కువగా విమర్శించారు. ఆయన వల్ల ఏదో జరగబోతోందన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఉద్దానంలో పవన్ పై ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్నారు. ప్యాకేజీ స్టార్, మ్యారేజీ స్టార్ అంటూ తన వికారాన్నంతా బయట పెట్టుకున్నారు. పవన్ పై జగన్ లో ఎంత అసహనం ఉందో ఆయన ప్రసంగంలోనే అర్థమయిపోతుందని… పవన్ విషయంలో .. జగన్ రెడ్డి అంచనాలు తారుమారయ్యాయని అంటున్నారు.
ఎన్ని చేసినా ఒంటరిగా పోటీ చేస్తారని అనుకుని ఉంటారని..కానీ టీడీపీతో పొత్తు పెట్టుకునేసరికి అసహనానికి గురవుతున్నారని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీపైనా జగన్ విమర్శలు గుప్పించారు.బర్రెలక్కకు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదని చెప్పుకొచ్చారు. కానీ అదే ఎన్నికల్లో జగన్ రెడ్డి పార్టీ పోటీ చేయలేకపోయారన్న సంగతిని చెప్పుకోలేకపోయారు.