ఎక్కడో తిరుపతిలో వాటర్ ట్యాంక్ కట్టాలన్న ప్రతిపాదన వస్తే.. హైదరాబాద్ లో భూసేకరణకు ఆదేశాలిచ్చే పాలన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉండేదన్న సెటైర్లు ఉండేవి. ఎందుకంటే హైదరాబాద్ చుట్టూ అప్పట్లో భూదందాలు అలా జరిగాయి. అందులో సొంత అస్తుల్లా ఇతరులకు కేటాయించేసి వారి దగర మంత్రి మాల్స్ రాయించేసుకున్న కంత్రీలు అప్పటి నేతలు. అంటే.. అసలు లక్ష్యం ఒకటి అయితే.. దానికి కారణం వెదుక్కోవడానికి ఉండే నేర్పు అంత చాకచక్యంగా ఉంటుందని ఇలాంటి వాటిని చూసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డి దాదాపుగా ఇదే ఫార్ములా అవలంభిస్తున్నారు. కాకపోతే ఇక్కడ సొంత పార్టీకి అన్వయిస్తున్నారు. కాస్త కూడా రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల, రాష్ట్ర సంపద పట్ల ఏ మాత్రం బాధ్యత లేదని పాలన అందించిన జగన్ రెడ్డి ఇప్పుడు ఆ తప్పంతా తనది కాదని.. మీ ఎమ్మెల్యేలేదని నమ్మించేందుకు ప్రజల మందుకు వస్తున్నారు. మీ ఎమ్మెల్యే తీవ్ర ద్రోహం చేశారు.. ఆయనను మార్చేస్తున్నా మళ్లీ నన్ను ఎన్నుకోండి అని.. ప్రజల వద్దకు వెళ్లేందుకు స్కెచ్ వేశారు. ఈ క్రమంలో తననే నమ్ముకుని జైలు పాలైన వాళ్లనీ వదిలి పెట్టడం లేదు. పూచిక పుల్లలా తీసి పడేస్తున్నారు.
ఎమ్మెల్యేలను వ్యతిరేకతకు దోషులుగా చూపిస్తారా ?
జగన్ రెడ్డి పదకొండు మంది ఇంచార్జుల్ని మార్చారు. మరో 90 మంది జాబితాలో ఉన్నారని కుట్ర సిద్ధాంతకర్త , ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు ఇచ్చి విశ్వసనీయవర్గాలు అని ప్రచారం చేయమని చెవిలో చెప్పారు. నీలి, కూలి మీడియా ఇదిగో జాబితా వీరంతా వైసీపీని నట్టేట ముంచిన వారు.. వీరి వ్యవహారం వల్ల జగన్ రెడ్డికి చెడ్డపేరు వచ్చింది.. చివరికి జగన్ రెడ్డి తెలుసుకున్నారు అందుకే.. అందర్నీ తీసేస్తున్నారని ప్రచారం చేయడం ప్రారంభించింది. రెండో విడతగా పది మంది మంత్రుల పేర్లనూ లీక్ చేశారు. ఇందులో రోజా , అంబటి రాంబాబు కూడా ఉన్నారు. వీరందరి వల్లే జగన్ రెడ్డి ఓడిపోబోతోతున్నారని.. జరిగిన తప్పులేమైనా ఉంటే వారే చేశారని.. జగన్ రెడ్డి కాదని ప్రజలను నమ్మించడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. జగన్ రెడ్డి నమ్మకద్రోహం ఎలా ఉంటుందంటే.. ఆ వైసీపీ నేతలు వేరే పార్టీలోకి పోలేరు. ఎందుకంటే. స్క్రిప్టులు ఇప్పించి మరీ విపక్ష నేతల్ని బండ బూతులు వారితో తిట్టించారు. ఓ వల్లభనేని వంశీ అయినా.. మద్దాలి గిరి అయినా.. రోజా అయినా .. అంబటి రాంబాబు అయినా.. వారితో వైసీపీ హైకమాండ్ ఎన్నెన్ని మాటలు అనిపించిందో అందరూ చూశారు. వారికి మరో చాయిస్ లేదు. టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీలోపడి ఉండాలి. ఎందుకంటే జగన్ రెడ్డి మాటలు విని రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చేసుకున్నారు. చాలా మంది.. నేతలు మాటల్లో కాకుండా చేతల్లో తమ శత్రుత్వం చూఫారు. ఫలితంగా.. రాజకీయ ప్రత్యర్థుల మొహం కూడా చూడలేకపోతున్నారు. అలాంటిది ఇక వారి పార్టీల్లో చేరడమా ?. అసాధ్యం. జగన్ రెడ్డి మొదటి నుంచి ఇదే ప్లాన్ తో ఉన్నారు. తాను వదిలేసినా తానే దిక్కు అన్నట్లుగా నేతలు ఉండాలని.. వేరే పార్టీల్లో చేరకూడనంత శత్రుత్వం పెంచాలనుకున్నారు. పదవుల కోసం వారికీ తప్పలేదు. ఇప్పుడు వారి పరిస్థితి ..సింపుల్గా రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. జగన్ రెడ్డి దయతలిచి ఓ పదవి పడేస్తే తీసుకోవాలి..లేకపోతే ఊరుకోవాలి.
మంత్రులు, ఎమ్మెల్యేలకు వాలంటీర్లకు ఉన్నంత విలువ అయినా ఉందా?
ఇంతా చేసి ఆ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమైనా చేశారా అంటే.. అసలు చేయడానికి వారికి చాన్స్ ఎక్కడ ఇచ్చారు. జగన్ రెడ్డి మొదటి కేబినెట్ మూడేళ్లు ఉంది. అందులో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. రెండో కేబినెట్ లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వారెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసా ?. డిప్యూటీ సీఎం అనే పదానికే అర్థం .. విలువ లేకుండా చేసేశారు జగన్ రెడ్డి. ఏపీలో ఉండే ఒక్కరంటే ఒక్క మంత్రి అయినా.. తన శాఖపై ఎప్పుడైనా సమీక్ష నిర్వహించడం మనం చూశామా ?. పదవి వచ్చిన కొత్తలో యువ మంత్రి విడదల రజనీ రెండు, మూడు రివ్యూలు చేశారు. ఆమెకు అలాంటి సపోర్ట్ వచ్చింది . రాను రాను అదీ కూడా లేదు. ఒక్క మంత్రి కూడా సెక్రటేరియట్ కు రారు. అందరూ నియోజకవర్గాల్లోనే ఉంటారు. ఎవరికీ తమ శాఖల్లో తీసుకునే నిర్ణయాలపై సమాచారం ఉండదు. ప్రెస్ మీట్ పెట్టు అని తాడేపల్లి ప్యాలెస్ లోని సజ్జల డెస్క్ నుంచి ఫోన్ వస్తే.. ఆ మేరకు ప్రెస్మీట్లు పెట్టడం తప్ప మంత్రులు ఏమీ చేయలేరు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎప్పుడూ ఆయన నియోజకవర్గంలోనే ఉంటారు. ఆయన పేరుకే మంత్రి. ఒక్క రోజన్నా కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వలేదు. మరో మంత్రి రోజా… వారానికోసారి తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని యాభైమందితో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్లడం తప్ప.. ఆమెకు చేసే పనేమీ ఉండదు. జగనన్న పుట్టిన రోజు వేడుకల్లో డాన్సులు వేయడం.. ఆడుదాం ఆంద్రా ప్రోగ్రాముల్లో షటిల్ ఆడటమే ఆమె విదులు నిర్వహించడం. ఇక ఏ మంత్రికీ బాధ్యతలు ఉండవు. అధికారాలూ ఉండవు. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక ఎమ్మెల్యేల సంగతి చెప్పాలా?. మా పరిస్థితి వాలంటీర్ల కంటే ఘోరంగా ఉందని ఎమ్మెల్యేలు జగన్ రెడ్డి ముందేవాపోయారు. కనీసం సంక్షేమ పథకాలు అయినా తమ చేతుల మీదుగా ఇస్తే ప్రజల్లో కాస్త విలువ ఉంటుందని మొరపెట్టుకున్నారు. కానీ జగన్ రెడ్డి ఎమ్మెల్యేల కన్నా వాలంటీర్లకే విలువ ఎక్కువ ఇచ్చారు. ఎంతగా అటే.. వాలంటీర్ల సమావేశం పెట్టి.. మీరంతా కాబోయే ప్రజాప్రతినిధులని హామీ ఇచ్చేంత ?. చివరికి తన ఇంటి ముందు రోడ్డు మొత్తం గుంతలు పడితే.. మరమ్మతులు కూడా చేయించుకోలేని ఘోరమైన దుస్థితి ఎమ్మెల్యేలది. అసలు ఎలాంటి పవర్ లేని వారిపై వ్యతిరేకత ఎందుకు వస్తుంది ?
పాలన చేసిన జగన్ రెడ్డిపైనే ప్రజా వ్యతిరేకత – అంతా ఇంతా కాదు!
ఎమ్మెల్యేలు, మంత్రులు నిమిత్త మాత్రులు అయితే మరి ప్రభుత్వంపై వ్యతిరేకత ఎలా పెరుగుతుంది ?. ఏ టు జడ్ పాలన చేసే వారి వల్లే పెరుగుతుంది. అది చేస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ పేరు మాత్రం జగన్ రెడ్డి. జగన్ రెడ్డిని చూసే జనం ఓట్లేశారు కాబట్టి.. అసలు వ్యతిరేకత జగన్ రెడ్డిపైనే. జగన్ రెడ్డిపై ప్రజల్లో ఎందుకంత వ్యతిరేకత ? . అసలు పోలీసుల్ని పెట్టి విజయవంతంగా కేసుల భయం పెట్టి విజయవంతంగా అణిచివేయగలిగారు కానీ.. లేకపోతే ఈ పాటికి శ్రీలంక తరహా ఉద్యమం ఏపీలో వచ్చి ఉండేది. స్వతంత్ర భారత చరిత్రలో ఓ రాష్ట్ర భవిష్యత్ ను ఇంతలా చిదిమేసిన పాలకుడు లేడు.. ఉండరని చెప్పాల్సిన పని లేదు. సొంత ప్రజలు.. సొంత రాష్ట్రంపై కుట్రలు చేసుకునే పాలకుడ్ని ఏపీలో తప్ప మరెక్కడా చూడలేం. పాలన చేపట్టి చట్టబద్ధమైన నిర్మాణం అయినా ప్రజాభవన్ ను కూల్చేసి… రుషికొండపై ఐదు వందల కోట్లతో చట్ట వ్యతిరేకమైన భవనం నిర్మించుకున్న నీతిలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సొంత రాష్ట్ర రాజధానిపై కులం ముద్ర వేసి.. రాష్ట్ర ప్రజలకు దక్కాల్సిన పది లక్షల కోట్ల సంపదను ఆవిరి చేసిన ఘోరమైన పాలకుడు. ఇసుకను అడ్డగోలుగా దోపిడీ చేసి లక్షల మంది ఉపాధిని.. వ్యాపారాల్ని దెబ్బకొట్టిన దుర్మార్గ పాలకుడు. మద్యం రేట్లను నాలుగైదు వందల శాతం పెంచి.. మద్యం అలవాటు ఉన్న పేద ప్రజల రక్తాన్ని పీల్చినపాలకుడు. అంతేనా.. రాష్ట్ర్ంలో ఫలానా వర్గం ఆయన వల్ల ప్రశాంతంగా బతికిలిందని చెప్పలగరా?. రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా ఇప్పుడు తంటాలు పడాల్సిందే. అత్యధిక రేషన్ బియ్యం సరఫరాదారులు కేజీకి పదిపేదలకు ఇచ్చి మిగతా బియ్యం స్మగ్లింగ్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్నపెద్దలెవరో తెలియదు. చివరికి ఫ్లెక్సీలు వేసుకుని బతికేవారినీ వదిలి పెట్టలేదు. ఏదో కోర్టు దయచూపింది కాబట్టి బతికిపోయారు.. ఇలా స్కూళ్లు, కాలేజీలు, చిరు వ్యాపారులు, సినిమా హాళ్లు, హోటళ్లు .. దేన్నీ వదిలి పెట్టలేదు. మొత్తానికి నాకించేశారు. దేశంలో అత్యంత నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం ఏపీనే అంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
రూ. 11 లక్షల కోట్ల అప్పు – చిల్లిగవ్వ సంపద సృష్టి లేదు !
సంక్షేమంతో చరిత్ర సృష్టించామని సొల్లు చెబుతూంటారు. అమ్మఒడి పేరుతో ఇచ్చే రూ. 13 వేలు ఒక్కటే పెద్దపథకం. ఇంకే పథకం లేదు. రైతులకు మూడు విడతల్లో ఇచ్చేది ఏడున్నర వేలు, మిగతా అన్ని పథకాల లబ్దిదారులు రాష్ట్ర వ్యాప్తంగా రెండు, మూడు లక్షల మంది ఉంటారు. అంటే నియోజకవర్గానికి వెయ్యి మంది. అందు కోసం ఎన్నెన్నిఆంక్షలు పెట్టాలో అన్నీ పెడతారు. కానీ ఈ పేరుతో తెగనమ్మిన ఆస్తులు.. పెట్టిన తాకట్లు.. ఆర్బీఐ దగ్గర్నుంచితెచ్చిన అప్పులు.. కార్పొరేషన్ల అప్పులు పదిలక్షల కోట్లు దాటిపోయాయి. పదకొండు లక్షల కోట్లు అయ్యాయని చెబుతున్నారు. దీనికి వస్తున్న ఆదాయం అదనం. మరి ఆ సొమ్మంతా ఎటు పోయింది. తెలంగాణలో ఐదు లక్షల కోట్ల అప్పులు చేశారు.. కానీ వారి కళ్ల ముందు లక్ష కోట్ల విలువైన అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ఉంది.. ఇంటింటికి నీరు సరఫరాచేసే మిషన్ భగీరథ ఉంది. హైదరాబాద్ లో అద్భుతమైన ఇన్ ఫ్రా డెలవప్ అయింది. తెలంగాణ మొత్తం రోడ్లు సాఫీగా సాగిపోయేలా అద్భుతంగా ఉంటాయి. మరి తెలంగాణ కంటే రెండింతలు అప్పు చేసి..ఏపీలో చేసిన అభివృద్ధి ఏమిటి ?. యాభైకోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఉద్దానం ఆస్పత్రిని ఐదేళ్లకు ప్రారంభించి.. మాటిచ్చా.. చేశానని చెప్పుకోవడమే అభివృద్ధి. చేసిన అప్పుతో రాజధాని పూర్తయ్యేది.. పోలవరం పూర్తయ్యేది. కానీ ఏదీలేదు. అంటే.. రాష్ట్ర భవిష్యత్ ను పూర్తిగా నాకించేశారు. ఇక కక్ష సాధింపుల గురించి చెప్పాలంటే… ఓ చరిత్ర. లా అండ్ ఆర్డర్ గురించి చెప్పుకోవాలంటే.. ఓ క్రిమినల్ చేతిలో పాలన ఉంటే ఎలా ఉంటుందో ఏపీ ప్రత్యక్ష సాక్ష్యం. ఇంక ప్రజలు వ్యతిరేకత పెంచకోకుండా ఎలా ఉంటారు?.
మార్చేయడానికి ప్రజలు రెడీ
చేసిన నిర్వాకాలు చిన్నవేం కావు. వెలగబెట్టిన ఘనకార్యాలు మర్చిపోయేవేం కావు. ప్రజల బతుకుల మీద దెబ్బకొట్టారు. ఆత్మాభిమానం తుంచేశారు. కుల మతాల ప్రకారం ఓట్లేస్తారని ఆశపడితే… కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎమ్మెల్యేలను మార్చినా.. మంత్రుల్ని మార్చినా.. చివరికి ప్రజలు మాత్రం జగన్ రెడ్డిని మార్చేస్తారు. ఇది భవిష్యత్!