తెదేపా నేతలు చాలా ధీటుగా, ఘాటుగా ఇచ్చిన సమాధానం వలననో ఏమో తెలియదు కానీ ఈరోజు ఒంగోలు పట్టణానికి వచ్చిన బీజేపీ జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు పురందేశ్వరి తెదేపాపై చిన్న విమర్శ కూడా చేయలేదు. పైగా ఎన్నడూ తెలుగు దేశం పార్టీ పేరును కూడా ఉచ్చరించడానికి ఇష్టపడని ఆమె ఆ పేరు ప్రస్తావించడమే కాకుండా దాని గురించి రెండు మంచి ముక్కలు కూడా మాట్లాడారు. ఒంగోలు పట్టణంలో సుమారు వంద ముస్లిం మహిళలను ఈరోజు ఆమె సమక్షంలో బీజేపీలో చేరారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మా పార్టీ మతతత్వ పార్టీ అనే ఒక అపోహ ఉంది. కానీ అది తప్పని నిరూపిస్తూ ఈరోజు మైనార్టీ వర్గానికి చెందిన మహిళలు మా పార్టీలో చేరుతున్నారు. వారందరినీ మా పార్టీ కుటుబ సభ్యులలాగ భావిస్తుంది,” అని అన్నారు.
“ఆర్ధిక, రైల్వే బడ్జెట్ లలో రాష్ట్రానికి ఎటువంటి అన్యాయం జరుగలేదు. నిజానికి ఎన్నాళ్ళుగానో పెండింగ్ లో ఉన్న అనేక రైల్వే ప్రాజెక్టులకి ఈ బడ్జెట్ లో మోక్షం లభించింది. త్వరలోనే రాష్ట్రానికి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన వెలువడుతుంది,” అని చెప్పారు.
తెదేపా-బీజేపీ సంబంధాల గురించి మాట్లాడుతూ “తెలుగు దేశం-బీజేపీల నేతలు మంచి అవగాహనతోనే కలిసి పనిచేస్తున్నారు. తెదేపా ప్రభుత్వంతో కేంద్రప్రభుత్వం నిత్యం మాట్లాడుతూనే ఉంది. వారు కోరిన విధంగానే రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కేంద్రప్రభుత్వం అన్ని విధాల సహాయసహకారాలు అందజేస్తోంది. రెండు పార్టీల రాష్ట్ర నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు లేదా భేదాభిప్రాయాలు ఉండవచ్చును. కానీ అవి మా పనికి అడ్డం కావు. రాష్ట్రాభివృద్దికి రెండు పార్టీలు, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృషి చేస్తున్నాయి,” అని పురందేశ్వరి అన్నారు. ఆమె తెదేపా గురించి ఇంత సౌమ్యంగా మాట్లాడటం బహుశః ఇదే మొదటిసారి కావచ్చును. కానీ ఈ సౌమ్యత ఎన్ని రోజులు ఉంటుందో ఎవరూ చెప్పలేరు.