సోషల్ మీడియాలో జరిగే ట్రోల్స్ కి జవాబుదారీతనం వుండదు. ఎవరు, ఎందుకు, దేనికోసం ట్రోల్ చేస్తున్నారో చాలా లోతుగా వెళ్లి పరిశీలిస్తే గానీ అంతుచిక్కదు. ఉదాహరణకు.. ఒక హీరో ఫోటోని డీపీగా పెట్టుకొని ”సినిమా రొటీన్ గా వుంది. ఫ్యాన్స్ కోసం మంచి సినిమా ఇవ్వాలి’ అని ఆ సదరు హీరో ఫ్యాన్స్ తెగ బాధపడిపోతుంటారు. ఆ ఎకౌంట్ లోపలకి వెళ్లి పోస్టులన్నీ లోతుగా గమనిస్తే.. ఆ పోస్టులన్నీ సదరు హీరో ఇమేజ్ ని తగ్గించేసేలానే వుంటాయి. సినిమా బాగాలేదని స్వయంగా హీరో గారి ఫ్యాన్సే బాధపడుతున్నారనే మ్యానిపులేషన్ స్టోరీ లు వైరల్ చేయడం ఆ హ్యండిల్స్ ముఖ్య ఉద్దేశం. మరి ఇలాంటి మ్యానిపులలేషన్స్ ఎందుకంటే .. అదోకరమైన శాడిస్టిక్ సంతృప్తి.!
ఇప్పుడు ఇలాంటి సందర్భమే మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమాకీ ఎదురౌతోంది. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ గా ‘బేబీ’ అనే పాటని వదిలారు. హీరో మీద ఇష్టంగా హీరోయిన్ పాడుకునే ఓ మెలోడీ ఇది. రామజోగయ్య శాస్త్రి రాశారు. తమన్ ట్యూన్ కూడా వినసొంపుగానే వుంది. లిరికల్ వీడియో కాబట్టి విజువల్స్ ఏమీ చూపించలేదు. ఏవో స్కెచ్చుల్లా కొన్ని ఇమేజులు చూపించారు. అయితే అనూహ్యంగా ఈ పాట పై దాడి మొదలైయింది. మహేష్ బాబు ఫ్యాన్స్ గ్రూప్స్ కే పాట నచ్చలేదంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. వ్యక్తిగత దూషణలకు దిగారు.
ఇదంతా పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ద్రుష్టికి వచ్చింది. ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. ఆ పాటలో మీకు ఏం తక్కువైయిందని గట్టిగానే నిలదీశారు. ఈ ట్రోల్స్ నిర్మాత వంశీ ద్రుష్టి వెళ్ళాయి. ఆయన కూడా కాస్త దూకుడు మనిషి. ‘మీ ట్రోల్స్ మాకు దీనితో సమానం’ అని అర్ధం వచ్చేలా యానిమల్ చిత్రంలోని మంకీ స్టొరీ విజువల్ ని పోస్ట్ చేశాడు. దీంతో ట్రోల్స్ మరింతగా రాజుకున్నాయి.
వంశీ చేసిన పోస్ట్ తగలాల్సిన వారికి గట్టిగానే తగిలింది. చాలా మంది తమ వాల్స్ పై గింజుకున్నారు. ఆ కాసేపటికే .. ‘ఇంతదారుణంగా ట్వీట్లు పెడితే ఇవరికైనా ఇలానే బాధిస్తుంది. దయచేసిన మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి’ అని మరో పోస్ట్ పెట్టారు. మరోవైపు రామజోగయ్య శాస్త్రి ఈ ట్రోల్స్ తో చిరాకు పడి ఆయన ట్విట్టర్ ని డియాక్టివ్ చేసేశారు.
నిజానికి ఈ పాట మరీ ట్రోల్స్ చేసేలా ఏం లేదు. సినిమాలోని కథ ప్రకారం ఏదో సందర్భంలోని ఒక చిన్న మెలోడీ సాంగ్ అయ్యింటుంది. దీనికి ఇంకా విజువల్స్ యాడ్ అవ్వలేదు. సాహిత్యం కూడా మరీ తీసిపారేసేది కాదు. తమన్ ట్యూన్ విషయానికి వస్తే.. రాములో రాములో పాట బీట్, టెంపో మార్చి ఈ ట్యూన్ ని అల్లేశాడని ఒక విమర్శ. పాట నిడివి కూడా తక్కువగా వుందని ఇంకొందరు.
నిజానికి ఈ విమర్శలు, ట్రోల్స్ వింతగా వున్నాయి. పాట నిడివి ఎంత వుండాలి, ఎలాంటి ట్యూన్ వుండాలనేది సోషల్ మీడియా హ్యండిల్స్ డిసైడ్ చేయడం ఇంకాస్త వింతగా వుంది. పైగా దినికి మహేష్ బాబు ఫ్యాన్స్ తో ముడిపెట్టేయడం ఇంకా ఇంకా వింతగా వుంది.