అధికారం కోల్పోయి ప్రతిపక్ష పాత్రలోకి మారిన బీఆర్ఎస్కు క్యాడర్ ను కాపాడుకోవడం అసలైన సవాల్‌గా మారుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీల్లో వలసల ప్రభావం కనిపిస్తోంది. పదవీ కాలం ఏడాది కూడా లేకపోయినా… కాంగ్రెస్ లో చేరి ఆ పదవుల్ని కాపాడుకోవడమో..లేదా కొత్తగా పొందడమో చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ రాజకీయ పునరేకీరణ పేరుతో అన్ని పార్టీల నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. వారు పార్టీకి అవసరమా కాదా అన్నది చూసుకోలేదు.
ఇతర పార్టీలకు నేతలు ఉండకూడదన్న లక్ష్యంతో రాజకీయం చేశారు. కానీ ఇప్పుడు అది రివర్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో చేరిన లీడర్లలో అత్యధిక మంది కాంగ్రెస్ క్యాడరే. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు.. ఇతర పనుల విషయంలో అధికార పార్టీ అండ ముఖ్యం. అందుకే మెల్లగా కాంగ్రెస్ నేతలకు దగ్గరవుతున్నారు. జనవరి నుంచే వరుసగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, తదుపరి సహకార ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. బీఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రెండు సార్లు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.
ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లను, మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో బీఆరెస్‌లోకి చేర్చుకున్నారు. గ్రామాల్లో పనులు కావాలంటే ప్రభుత్వ పార్టీలో చేరాలన్న సాకుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆరెస్‌లోకి అప్పట్లో వలసల పర్వం సాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున అదే వలసల విధానం బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి పెద్ద సంఖ్యలో వలసలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీలోకి సాగే వలసలకు అడ్డుకట్ట వేయడం బీఆరెస్‌కు అంత సులభం కాదని అంచనా వేస్తున్నారు