మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థపై ఉద్దేశపూర్వక దాడికి తెగబడిన ఏపీసీఐడీ అధికారులు తెలంగాణ హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. కోర్టు ఆదేశాలు ఉన్నా… మార్గదర్శి యాజమాన్యం పరువు తీయడానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. అయితే తమ మెయిల్స్ క సమాధానం ఇవ్వలేదని అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని సీఐడీ లాయర్లు వాదించారు. ఇది కూడా తప్పేనని కోర్టు గుర్తించింది. చివరికి సీఐడీ అధికారులు తప్పు చేశామని ఒప్పుకని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
లుకౌట్ నోటీసులు జారీ చేసి తప్పు చేశామని…క్షమాపణలు కోరుతున్నామని తెలంగాణ హైకోర్టుకు ఏసీసీఐడీ లాయర్లు లేఖలు సమర్పించారు. లేఖలు కాదని.. అఫిడవిట్ సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆ పని చేయనున్నారు. ఎలాగైనా తాము తప్పు చేశామని సీఐడీ అధికారులు అంగీకిరంచినట్లయింది. ఇప్పుడు వారిపై కత్తి వేలాడటం ఖాయం. కోర్టు క్షమించినా… వచ్చే ప్రభుత్వం ఊరుకోకపోవచ్చు. తప్పుడు కేసులు పెట్టినందుకు కేసులు పెట్టి.. ప్రాసిక్యూట్ చేసినా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే తప్పుడు పని చేశామని కోర్టు ముందు అంగీకరించారు కూడా. మరో వైపు ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపద్దని హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.
మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలన్న పిటిషన్పై జస్టిస్ అభయ్ ఎస్.ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మార్గదర్శి ట్రాన్స్ఫర్ పిటిషన్పై తదుపరి విచారణను ఫిబ్రవరి 2కి వాయిదా వేసింది. ఒకే రకమైన అంశంపై పలు కేసులు పెట్టారని మార్గదర్శి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.