రన్ టైమ్ విషయంలో దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. సినిమా మాగ్జిమం రెండున్నర గంటలు అంతే. దానికంటే ఎక్కువైతే.. జనాలు బోర్ ఫీలవుతారని భయం. అందుకే ఎంత మంచి సన్నివేశాలకైనా కత్తెర వేయక తప్పదు. స్క్రిప్టు దశలోనే రన్ టైమ్ పై ఓ అవగాహనకు వచ్చి, దానికి తగ్గట్టుగానే సీన్లు కుదించుకొంటుంటారు. అయితే.. ‘యానిమల్’ ఈ సూత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 21 నిమిషాలు. ప్రమోషన్ కంటెంట్ తో పిచ్చెక్కించిన యానిమల్… రన్ టైమ్ విషయంలో మాత్రం భయపెట్టింది. కానీ.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్కడా తగ్గలేదు. రన్ టైమ్‌ని కుదించడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆ సినిమా అలానే విడుదలైంది.
కానీ అనూహ్యంగా ఓ అద్భుతం జరిగింది. సినిమాని యూత్ పిచ్చెక్కినట్టు చూసేశారు. రన్ టైమ్ పై వాళ్లకు ధ్యాసే లేకుండా పోయింది. సినిమా బాగుంటే, రన్ టైమ్ గురించి ఎవరూ పట్టించుకోరు అని చెప్పడానికి ‘యానిమల్’ ఓ ఉదాహరణగా నిలిచింది. ఇప్పుడు ‘సలార్’ వస్తోంది. దీని రన్ టైమ్ 2 గంటల 55 నిమిషాలు. రెండు భాగాలుగా సలార్‌ని తీర్చిదిద్దారు. లెంగ్త్ ఎక్కువవుతోంది అనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నారు. అయినా సినిమా 2 గంటల 55 నిమిషాలు వచ్చిందంటే అనూహ్యమే అనుకోవాలి. చివరి నిమిషాల్లో ట్రిమ్ చేస్తారేమో అనుకొన్నారు. కానీ.. సలార్ టీమ్ మాత్రం యధాతధంగా సినిమాని విడుదల చేయాలని నిర్ణయం తీసుకొంది. ఇదంతా..’యానిమల్’ ఇచ్చిన స్ఫూర్తి కావొచ్చు. రెండు భాగాలుగా చేయకపోతే… అసలైన రన్ టైమ్ ఎంతుండేదో మరి. ‘యానిమల్’ లా ‘సలార్’కీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడితే.. ఇకపై రన్ టైమ్ భయాలు దర్శకుల్లో పోయినట్టే.