తెలుగు సినిమా సత్తాని ఉత్తరాదిన చాటిన సినిమా… పుష్ప. బన్నీ క్యారెక్టరైజేషన్‌కి… బాలీవుడ్ మొత్తం ఫిదా అయిపోయింది. బన్నీ డైలాగులు, మేనరిజం… బాలీవుడ్ లోని మూల మూలకి వెళ్లిపోయాయి. ఆఖరికి అంతర్జాతీయ క్రికెటర్లు సైతం… పుష్పని ఇమిటేట్ చేయడం మొదలెట్టారు. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకొన్న ఈ సినిమా అనూహ్యంగా, బాలీవుడ్ లో ఊహించని ఆదరణ సంపాదించుకొని, సూపర్ డూపర్ హిట్టయిపోయింది. ఈ సినిమాకి నేటితో రెండేళ్లు.
ఆర్య, ఆర్య 2… అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు. ఆర్య లవ్ స్టోరీల్లో ఓ సరికొత్త టచ్. అందులోనూ హీరో క్యారెక్టరైజేషనే హైలెట్. ఆర్య 2లోనూ సుకుమార్ అదే చేశాడు కానీ, ఆర్యతో పెరిగిపోయిన అంచనాల్ని అందుకోలేకపోయాడు. సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే పాటలు బాగా ఎక్కేశాయి. బిట్లు బిట్లుగా చూస్తూ.. ఈ సినిమా కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది.
మరి ఈ ఇద్దరూ కలిసి ముచ్చటగా మూడో సినిమా చేస్తే ఎలా ఉంటుంది..? అదే.. `పుష్ప` అయ్యింది. నిజానికి మహేష్ బాబు కోసం సుకుమార్ రాసుకొన్న కథ ఇది. మహేష్ ఎందుకో ఇంత రా క్యారెక్టర్ ని చేసే డేర్ చేయలేకపోయాడు. అలా… మహేష్ కోసం రాసిన పుష్ప కాస్త బన్నీ దగ్గరకు వచ్చేసింది. స్క్రిప్టు దశలో పుష్ప 2 చేసే ఆలోచన లేదు. కానీ.. మేకింగ్ లో దిగేసరికి ఈ సినిమా స్పాన్ సుక్కుకి అర్థమైంది. దాంతో ఇంట్రవెల్ బ్యాంగ్ ని కాస్త క్లైమాక్స్ కి తీసుకొచ్చి… సెకండాఫ్‌ని పార్ట్ 2గా మార్చేశాడు. అలా.. రెండేళ్ల క్రితం పుష్ప విడుదలైంది.
విడుదల రోజున డివైడ్ టాక్ గట్టిగా వినిపించింది. కానీ మెల్లగా సినిమా పుంజుకొంది. ముఖ్యంగా నార్త్ లో కనీవినీ ఎరుగని వసూళ్లు అందుకొంది. అలా.. ఇక్కడ కూడా హిట్ నుంచి సూపర్ హిట్ కి పరుగులు పెట్టింది. బన్నీ నటనకు బాక్సాఫీస్ ఫిదా అయిపోయింది. ఆఖరికి ఆయనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కట్టబెట్టింది. జాతీయ అవార్డుల ప్రహసనం మొదలైన ఇన్నేళ్లలో ఏ తెలుగు నటుడికీ దక్కని గౌరవం అది. ప్రపంచ వ్యాప్తంగా 356 కోట్లు సాధించింది. ఒక్క హిందీ బెల్ట్ లోనే వంద కోట్లు తెచ్చుకొంది. రెండు జాతీయ అవార్డులు (ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు)తో పాటు 7 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు పొందింది. 2021లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.
ఇప్పుడు అందరి కళ్లూ పార్ట్ 2పైనే ఉన్నాయి. పార్ట్ 1 కంటే మిన్నగా ఈ సినిమాని తీర్చిదిద్దాలన్న ఆశయంతో సుకుమార్ తీవ్రంగా కష్టపడుతున్నాడు. స్క్రిప్టుకే దాదాపు ఏడాది సమయం తీసుకొన్నాడు. పార్ట్ 2కి ఏకంగా రూ.300 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు టాక్. ఆడియో రైట్స్ రూపంలో ఇప్పటికే 60 కోట్లు వెనక్కి వచ్చేసినట్టు తెలుస్తోంది. మరి… పుష్ప సాధించిన రికార్డులు పుష్ప 2 బద్దలు కొడుతుందా? మరోసారి తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో నిలబెడుతుందా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.