బీజేపీలో ముఖ్యమంత్రులుగా ఎవరు ఉండాలన్నదానిపై అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ కొంత కాలంగా నడుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించింది. ఆయా రాష్ట్రాల్లో మాస్ లీడర్లుగా ఉన్న వారు.. తిరుగులేని నేతలుగా ఉన్న వారందర్నీ పక్కన పెట్టేశారు. తొలి సారి ఎమ్మెల్యే అయిన వారికి.. బ్యాక్ బెంచర్స్కు ముఖ్యమంత్రి పదవులు కట్టబట్టింది. ఈ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆ పార్టీ ఎల్పీ మీటింగ్‌లో చివరి బెంచ్‌లో కూర్చున్నారు. తనకు ఎల్పీ నేతగా ఎంపిక చేస్తారని ఆయన అసలు అనుకోలేదు. పేరు ప్రకటించగానే ఆయనతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. అలా బ్యాక్ బెంచ్ మీద నుంచి స్టేజ్ మీదకు వెళ్లిపోయారు. ఇక రాజస్థాన్ సీఎం శర్మ కూడా అంతే. అయన తొలి సారి ఎమ్మెల్యే, చత్తీస్ ఘడ్ సీఎం కూడా రాజకీయంగా అనామకుడే. అయినా అందర్నీ తీసుకొచ్చి ముఖ్యమంత్రుల్ని చేశారు. అయితే వీళ్లెవరూ అనామకులు కాదని.. మీడియానే పట్టించుకోలేదని మోదీ చెబుతున్నారు.
ఇదంతా బీజేపీ భవిష్యత్ కోసమే చేస్తున్నారన్న వాదన వినిపిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. మరి ఇదే ఫార్ములాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల తరవాత ప్రధాని అభ్యర్థిత్వానికి పరిశీలిస్తారా అంటే.. అలాంటి చాన్సే లేదని మోదీ చెబుతున్నారు. తానే మూడో సారి ప్రధాని అవుతానని అంటున్నారు. నిజానికి బీజేపీలో ఉన్న వయసు నిబంధన ప్రకారం చూస్తే.. మోదీ మూడో సారి ప్రధాని కాకూడదు. కానీ తన పదవి విషయంలో ఆయన తగ్గట్లేదు. పదే పదే తానే మూడో సారి ప్రధానిని అవుతానని.. దేశాన్ని మూడో ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుస్తానని చెబుతున్నారు.
బీజేపీలో మోదీ కంటే సీనియర్లు.. ఆయన గుజరాత్ మోడల్ పేరుతో ప్రచారం చేసుకోక ముందు తమ రాష్ట్రాల్లో గొప్పగా పరిపాలించిన నేతలంతా ఇప్పుడు సైడైపోయారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మోదీ మాట జవదాటని నేతలే సీఎంలుగా ఉన్నారు. సీనియర్లంతా.. నోరెత్తకుండా సైలెంట్ అయిపోతున్నారు.