ఏపీలో జగన్ రెడ్డి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని తేలిపోయింది. మరో వైపు పుండు మీద కారంలా షర్మిల ఏపీలోకి అడుగు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. కుమారుడి పెళ్లి తర్వాత ఆమె ఏపీ రాజకీయాల్లోకి రావొచ్చంటున్నారు. ఇప్పుడు ఈ కష్టాన్ని అధిగమించేందుకు జగన్ కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారు. దూరం చేసుకున్న చెల్లి షర్మిలను, తల్లి విజయమ్మను మళ్లీ దగ్గరకు తీసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. తగిన గౌరవం కల్పించడం తప్ప మరో మార్గం లేదని జగన్ సన్నిహిత వర్గాలు కూడా ఆయనకు నచ్చచెప్పాయని తెలుస్తున్నది.
తిరిగి పార్టీలోకి వస్తే కమలాపురం అసెంబ్లీ స్థానాన్ని తన తల్లికి ఇస్తానని, కడప పార్లమెంటు సీటును చెల్లి షర్మిలకు కేటాయిస్తానని ప్రతిపాదించారని, ఈ ప్రతిపాదనపై విజయమ్మను ఒప్పించాలని కోరారని ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కమలాపురం నుంచి విజయమ్మ సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డి, కడప ఎంపీగా వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. కమలాపురం నుంచి మరోసారి రవీంద్రనాథ్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని చెబుతున్నారు. విజయమ్మ ఇక్కడి నుంచి పోటీ చేస్తే జనం సానుకూలంగా స్పందిస్తారనేది జగన్ ఆలోచన అంటున్నారు. ఇక కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి విషయంలోనూ జగన్ అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు.
తన బాబాయి వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాశ్‌కు మరక అంటుకున్నది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారిస్తున్నది. హైకోర్టు బెయిల్‌పై ఉన్న అవినాశ్‌తో తన ప్రతిష్ఠకూ మసక ఏర్పడిందనే భావనతో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ మచ్చ నుంచి బయటపడడంతో పాటు, కాంగ్రెస్ పుంజుకోకుండా చూడటం, రెండోసారి అధికారం చేజిక్కించుకోవడం అనే లక్ష్యాలతో శివకుమార్‌తో రాయబారం నడిపించినట్టు చెబుతున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి తర్వాత ఈ అంశంపై షర్మిల, విజయమ్మ ఎలా స్పందిస్తారన్నది తేలే అవకాశం ఉంది.