చాలామంది హీరోలు తమ సినిమాకి ‘ఫ్లాప్’ టాక్ రాగానే వదిలేస్తారు. యావరేజ్లూ వాళ్లని ప్రేరేపించవు. హిట్ అయితే కానీ కెమెరా ముందుకు రారు. సక్సెస్ టూర్లు చేయరు. కానీ నాని అలా కాదు. ‘యావరేజ్ని’ అస్సలు వదలడు. ఆ సినిమాని హిట్ చేసేంత వరకూ వదలడు. ‘హాయ్ నాన్న’ సినిమానే అందుకు నిదర్శనం. ఈ సినిమాకి ఓపెనింగ్ రోజున డివైడ్ టాక్ వచ్చింది. వసూళ్లూ నాని సినిమా స్థాయిలో లేవు. కానీ.. నాని వదల్లేదు. గట్టిగా ప్రమోట్ చేశాడు. యూ.ఎస్ అంతా తిరిగాడు. అక్కడ ఈ సినిమాకి మంచి వసూళ్లు రావడానికి కారణం.. నాని చేసిన పబ్లిసిటీనే. క్రమంగా సినిమా పుంజుకొంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. అలా.. యావరేజ్ మార్క్ దగ్గర ఆగిపోవాల్సిన ఓ సినిమాని నాని హిట్ చేసేంత వరకూ వదిలిపెట్టలేదు.
ఈ సినిమానే కాదు.. గతంలో ‘దసరా’కీ అదే జరిగింది. దసరా కూడా తొలిరోజు యునానిమస్ టాక్ ఏం తెచ్చుకోలేదు. అటూ ఇటుగా మాట్లాడిన వాళ్లే అంతా. కానీ ఆ సినిమాని గట్టిగా నమ్మిన నాని.. ముందు నుంచీ ఎగ్రసీవ్గా ప్రమోషన్స్ చేసుకొంటూ వచ్చాడు. దసరా ఓపెనింగ్స్ అదిరిపోవడానికి నాని స్ట్రాటజీనే బలమైన కారణం. ఆ తరవాత కూడా నాని సినిమాని వదల్లేదు. అన్ని రకాలుగా ప్రమోషన్ స్పీడు పెంచాడు. అలా.. దసరా నాని కెరీర్లో మంచి వసూళ్లు సాధించిన సినిమాగా మిగిలిపోయింది. ఓ సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి నానిలా తపించే హీరోలు ఉంటే… నిర్మాతలకు అంత కంటే కావల్సింది ఏముంది? ఈ విషయంలో నానిని మెచ్చుకోవాల్సిందే.