సమావేశాలు జరుగుతున్న సమయంలో నేరుగా లోక్ సభలోకి దుండగులు చొచ్చుకు వచ్చి స్మోక్ బాంబులు ప్రయోగించిన వ్యవహారంపై కేంద్రం దేశ ప్రజలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా లేదు. పార్లమెంట్లో ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూంటే.. వారందర్నీ సస్పెండ్ చేసి పడేశారు. కాంగ్రెస్ సభ్యులను శీతాకాలసమావేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభతో పాటు రాజ్యసభలోనూ అదే నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభలోకే నేరుగా దుండగులు రావడం తీవ్రమైన భద్రతా వైఫల్యమని ప్రధాని అంగీకరించారు. అయితే అది పార్లమెంట్ లో కాదు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. దానిపై విచారణ జరుగుతోందని రాజకీయం చేయవద్దని విపక్షాలకు సలహా ఇచ్చారు. ప్రధాని అసలు జరిగిందేమిటో.. చెప్పడానికి పార్లమెంట్ నడుస్తూండగా.. ఆయన మీడియా ద్వారా కాంగ్రెస్‌కు సలహా ఇవ్వడం ఏమిటన్న విస్మయం వ్యక్తమవుతోంది.
బీజేపీ ఎంపీ పాస్‌ల ద్వారానే వారు పార్లమెంట్ విజిటర్స్ గ్యాలరీలోకి వచ్చారు. అక్కడ్నుంచి లోక్ శభ సమావేశాలు జరుగుతున్న ప్రాంగణలోకి దూకారు. స్మోక్ బాంబులు ప్రయోగించారు. వారి చర్య వెనుక అంతర్జాతీయ శక్తులు లేవని.. కేవలం సంచనలం కోసమే చేశారని వాదన వినిపిస్తున్నారు. కానీ అదంతా అనధికారికమే. వాస్తవంగా ఏం జరిగిందో మాత్రం తెలియడంలేదు. దేశ ప్రజలకు పార్లమెంట్ ద్వారా చెప్పాలన్న ఆలోచన కూడా చేయడంలేదు. విపక్షాలను సస్పెండ్ చేస్తున్నారు కానీ.. అసలు విషయం చెప్పడం లేదు.