కేసీఆర్ హాయంలో రూ. ఆరు లక్షల కోట్లు అప్పు చేశారని వాటికి ఇప్పుడు అసలు, వడ్డీలు కట్టుకోలేని స్థితికి తీసుకు వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ వాటాకాగా అప్పు రూ. 72,658 కోట్లు వస్తే.. బీఆర్ెస్ సర్కార్ దిగిపోయే నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లుగా లెక్క తేలింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు రుణభారం పెరిగిందని శ్వేతపత్రంలో వెల్లడించారు. 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 4.98 లక్షల కోట్ల వ్యయం చేశారని.. అంత కంటే ఎక్కువ అప్పు కేసీఆర్ సర్కార్ చేసిందని ప్రభుత్వం తెలిపింది.
2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. 2023లో అప్పుల్లో ఉందన్నారు. బడ్జెటేతర రుణాలు పేరుకుపోయి అప్పుల ఊబిలో తెలంగాణ కూరుకుపోయిదని… ఆర్బీఐ దగ్గర రోజూ వేస్ అండ్ మీన్స్ కింద అప్పు తెచ్చుకుని ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి ఉందని నివేదిక తెలిపింది. ప్రజలంతా అభివృద్ధి చెందాలని తెలంగాణ సాధించుకున్నాం. గత ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించలేదని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి.
ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తున్నానన్నారు. దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలి. ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తామని భట్టి తెిలపారు. దీనిపై హరీష్ రావు మండిపడ్డారు. ఇలా ప్రచారం చేయడం వల్ల పెట్టుబడులు రావన్నారు. గత ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఇలాంటి ప్రచారం చేయడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు.
తెలంగాణ దివాలా స్థితిలో ఉందని తెలిస్తే అంతర్జాతీయంగా ఇమేజ్ పోతుందని పెట్టుబడులు రాకుండా పోతాయన్నారు. తెలంగాణకు కేంద్రం రావాల్సిన వాటి గురించి కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఏపీ అధికారులతో శ్వేతపత్రం రెడీ చేయించారని హరీష్ రావు ఆరోపించారు.