ఆతిథ్యం విషయంలో ప్రభాస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తోటి నటులకి తన ఇంటి వంటకాల రుచి చూపించడం ఆయనకి ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఆతిథ్యం స్వీకరించిన వాళ్లంతా ప్రభాస్ గురించి, వంటకాల గురించి కథలుగా చెబుతారు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ జాబితాలో చేరారు. సలార్ చిత్రంలో ప్రభాస్, పృథ్వీరాజ్ కలిసి పని చేశారు. తాజాగా రాజమౌళి చేసిన సలార్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆతిథ్యం ప్రస్థావన వచ్చింది. ప్రభాస్ తో మీకుకున్న వింత అనుభవం గురించి చెప్పిండని రాజమౌళి అడిగితే.. ప్రభాస్ ఆతిథ్యం గురించి ఆసక్తికర అంశాలు చెప్పారు పృథ్వీరాజ్.
”ప్రభాస్ తో వున్నపుడు ఎవరూ డైట్ పాటించలేరు. ఒకసారి మా పాప సలార్ సెట్ కి వచ్చింది. సరదా మాట్లాడి తనకి ఇష్టమైనవి ఏమిటో తెలుసుకున్నారు. కట్ చేస్తే.. రూమ్ అంతా వంటకాలతో నిండిపోయింది. మీరు నమ్మరు.. ఆ వంటకాలన్నీ ఒక ప్రత్యేక రూమ్ తీసుకొని అందులోకి తరలించాల్సివచ్చింది. అన్ని రుచులు ఒకేచోట నేనెప్పుడూ చూడలేదు. మా బంధవులందరూ తిన్నా ఆ భోజనం ఇంకా మిగిలిపోతుంది. పొరపాటున కూడా ప్రభాస్ దగ్గర ఫలానా వంటకం ఇష్టమని ఎప్పుడూ చెప్పకూడదు. ఈ విషయంలో తను చాలా డేంజర్(నవ్వుతూ). అయితే అతిధులకి పెట్టడం తప్పితే ఆయన నాలుగు రుచులు ఒకేసారి తిన్నట్లు నాకెప్పుడు కనిపించలేదు. కాస్త పప్పన్నం ఓ పచ్చడి వుంటే ఆయనకి సరిపోతుంది” అంటూ ప్రభాస్ ఆతిధ్యానికి ఫిదా అయిపోయారు పృథ్వీరాజ్.