ప్రపంచంలో వందల సినిమాలు కొత్తగా వస్తున్నా కథలు మాత్రం అయిదారే అన్నారట ఎవరో. ఒక కాన్సెప్ట్ ఒకసారి ప్రేక్షకులకు నచ్చితే ఎన్నిసార్లయినా నచ్చుతుందనేది దర్శక పితామహుడు సి.పులయ్య సూక్తి. అందుకే ఆయన తన పాత చిత్రం లవకుశను కొన్ని దశాబ్దాల తర్వాత యథాతథంగా తీసి చరిత్ర సృష్టించారు. వీటికి మూస చిత్రాలని ఫార్ములా సినిమాలనీ అనేబదులు జానర్ అని ఓ ముద్దు పేరు పెట్టుకున్నారు. అసలా సంగతి ప్రేక్షక మహాశయులకే బాగా తెలుసు. అయినా చూస్తుంటారు. ప్రతి దర్శకుడికీ ఓ జానర్.. ప్రతి హీరోకూ ఓ జానర్.. భిన్నమైన చిత్రాలు తీస్తారని పేరున్న దర్శకులూ ఇందుకు మినహాయింపు కారు. క్రాంతి కుమార్‌ను తీసుకోండి.. తెలుగులో శారద నుంచి సీతారామయ్య గారి మనవరాలు వరకూ ఆయన అభిరుచి గల దర్శకుడు. కాని ఈ రెండు సినిమాలతో సహా చాలా వాటిలో చనిపోయిన వారిని బతికి వున్నట్టు అవతలివారిని నమ్మించడం అనే ఎలిమెంటు ముఖ్యంగా వుంటుంది. దాసరి నారాయణరావును తీసుకోండి. మొదటి చిత్రం తాత మనవడు నుంచి తనే నటించిన సూరిగాడు వరకూ తలిదండ్రులను సంతానం నిర్లక్ష్యం చేయడమే ఇతివృత్తం. మధ్యలో వేరే సినిమాలు రాలేదని కాదు గాని జీవ ధాతువుగా వుండే పార్ములా ఇదే.
ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ విషయం.. ఆయన భాషా చిత్రం ఒక కొత్త జానర్‌ను ప్రవేశపెట్టింది. దాన్నే ఫాక్షన్ చిత్రాలకు అన్వయించి బాలయ్య సమరసింహారెడ్డి మొదలు చిరంజీవి ఇంద్ర వరకూ, జూనియర్ ఎన్టీఆర్ ఆది వరకూ అనేక హిట్లు. పూర్వాశ్రమంలో శత్రువులను గడగడలాడించిన వారు శాంతమూర్తులై బతుకుతుంటే మళ్లీ పాత పరిస్థితి పునరావృతం కావడం ఈ ఫార్ములా. ఇప్పుడు రజనీ కాంత్ వరుసగా కొన్ని ప్రయోగాలు చేసి విఫలమైన తర్వాత మళ్లీ దాన్నే ఆశ్రయించినట్టు కనిపిస్తుంది. కబాలి కథ చదివితే పూర్వపు ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్ ఒక అనాధాశ్రమం నడుపుతుంటే అనుకోకుండా ఆనాటి శత్రుముఠాలు తారసపడతాయట. ఇంకేముంది? భాషా భాషా అన్న మాటలు వినిపిస్తుంటే నెగిటివ్ షేడ్‌లో రజనీకాంత్ కదలిపోవడం కనిపించడం లేదా? కాబట్టి జానర్ అనండి.. సక్సెస్ మంత్ర అనండి.. మూస అనండి.. ఏదైనా బాగుంటే చూసి ఆనందించడమే!