నలుగురు లోక్ సభ ఎంపీలు, ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని తెలియడంతో కేసీఆర్ అప్రమత్తం అయ్యారు., పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదని.. హైదరాబాద్ వచ్చేయాలని వారందర్నీ కేసీఆర్ ఆదేశించారు. ఢిల్లీ రాజకీయాల ప్రభావం .. బీఆర్ఎస్ పై పడకుండా జాగ్ర్తతలుతీసుకుంటున్నారు. ఎంపీలంతా అందుబాటులో ఉండాలని ఆయన నుంచి ఆదేశాలు రావడంతో ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీలు అందరూ వెనక్కి వచ్చేశారు.
హైదరాబాద్ లో ఎంపీలతో కేసీఆర్ విడివిడిగా భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ తప్పు జరిగింది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ తప్పులకు అవకాశం ఇవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తారని అంటున్నారు. పార్టీ మారే ఉద్దేశం ఉన్న ఎంపీలను బుజ్జగించడంతో పాటు.. అభ్యర్థులను కూడా ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారని.. ఎవరైనా పార్టీ మారే ఉద్దేశంలో ఉంటే చివరి క్షణం వరకూ వారిని భరించాల్సిన పని లేదని కేసీఆర్ అంచనాకు వస్తున్నారు.
మరోవైపు కేసీఆర్ ఎంపీగా పోటీ చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయన మళ్లీ మెదక్ నుంచి బరిలో ఉంటారని చెప్పుకుంటున్నారు. దీనిపై ఏమైనా చర్చిస్తారా అనే ఆసక్తి మొదలైంది. ఇప్పటికే ఎంపీలుగా ఉన్న వారి స్థానంలో కొత్త వారిని పెట్టాలనే డిమాండ్ కూడా పార్టీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. దీనిపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే కాంగ్రెస్ వ్యూహాలు రెడీ చేస్తోంది. కాంగ్రెస్ కూడా అభ్యర్థుల కసరత్తు చేస్తోంది.