ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు రంగం సిద్ధమవుతోంది. బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీయేను రానున్న లోక్సభ ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 28 ప్రతిపక్ష పార్టీలు ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ పేరిట ఒక్కతాటిపైకి వచ్చినా.. మీ నాయుకుడు ఎవరని బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు వెటకారం చేస్తూనే ఉన్నారు. హిందీ బెల్ట్ లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచి ఉంటే.. రాహుల్ ను ఏకపక్షంగా ప్రధాని అభ్యర్థిగా అంగీకరించి ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా డిమాండ్ చేయలేకపోతోంది.
ఇండియా కూటమిలోని మొత్తం 28 భాగస్వామ్య పక్షాలకుగాను 12 పార్టీలు ఖర్గే ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. గతంలో ఎన్నికల తర్వాతే ప్రధాని ఎవరో నిర్ణయిస్తామని చెప్పిన మమతాబెనర్జీ ఇప్పుడు ఖర్గేను ప్రతిపాదించడం ఆసక్తికరంగా మారింది. అరవింద్ కేజ్రీవాల్ కూడా అంగీకరించారు. మూడురాష్ట్రాల్లో మిత్రపక్షాలకు సీట్లివ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం రెడీ అవుతోంది. కనీసం 400కుపైగా స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనుకుటున్నారు.
ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తానే ఎన్డీఏ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా చెబుతున్నారు. బీజేపీలో ఉన్న వయసు నిబంధనల ప్రకారం మోదీ ఈ సారి ప్రధాని చేపట్టకూడదు. కానీ అలాంటి ఆలోచన బీజేపీలో ఉండదు. కానీ ఆయనను ధీటుగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా.. కూటమి తరపున ప్రధాని అభ్యర్థిని ప్రకటించాలన్న ఆలోచన .. ఎక్కువ మందిలో ఉంది. ఖర్గే గొప్ప ప్రజాదరణ ఉన్న నాయకుడు కాకపోవచ్చు కానీ.. ఆయన దళిత నాయకుడు. దేశానికి దళిత ప్రధాని వస్తాడంటే.. దళితులంటే ఏకమవుతారని..ఇది కూటమి విజయావకాశాల్ని మెరుగు పరుస్తుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.