అసెంబ్లీలో కాంగ్రెస్ శ్వేతపత్రాలను సరిగ్గా తిప్పికొట్టలేకపోయామని భావిస్తున్న బీఆర్ఎస్ ప్రత్యేకంగా తాము ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. కేవలం అప్పులు మాత్రమే చేయలేదని అంత కంటే ఎక్కువగా ఆస్తులు సృష్టించామని.. తమ స్వేదంతో తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చామని చెప్పాలనుకుంటోంది. అందుకే తమ ప్రజెంటేషన్‌కు స్వేదపత్రం అని పేరు పెట్టుకుంది. తెలంగాణ భవన్ వేదికగా శనివారం ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పేరుతో బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం, దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని బీఆర్ఎస్ చెబుతోంది. పగలూ రాత్రి తేడా లేకుండా.. చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని బీఆర్ఎస్ అధిష్టానం, ఎమ్మెల్యే కేటీఆర్ గట్టిగా చెబుతున్నారు. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం, అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. గణాంకాలతో సహా తెలంగాణ వాస్తవ ముఖచిత్రాన్ని వివరిస్తామన్నారు.
తాము చేసింది అప్పులు కాదని, అభివృద్ధి అన్నారు. స్వేద పత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను శనివారం ఆవిష్కరిస్తామని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.