సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ జై భారత్ నేషనల్ పార్టీని ప్రకటించారు. ఇది కొత్త పార్టీ అనుకున్నారు కానీ.. కాదు .. పాతదే. ఓ పెద్దాయన పెట్టి… కౌన్సెలర్‌గా కూడా గెలవకపోవడంతో షెడ్డుకెళ్లిపోయిన పార్టీకి అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అంతా బాగానే ఉంది కానీ మార్చేస్తానని ఆయన చెప్పిన మాటలు విని చాలా మంది ఆశ్చర్యపోయారు. తప్పులు చేయను.. అప్పులు చేయనని ప్రాస ప్రకారం చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా సాధిస్తానన్నారు. ఆయన చెప్పిన మాటలు ఇతర రాజకీయ నేతలు చెప్పిన దాని కంటే ఎక్కువ అతిశయోక్తిగా ఉన్నాయి.
ప్రత్యేకహోదా పేరుతో ఇప్పటి వరకూ మోసం చేయని పార్టీ లేదు. పార్లమెంట్ లో అప్పటి ప్రధాని ప్రకటించిన హామీని.. ఎన్నికల మేనిపెస్టోలో పెట్టిన బీజేపీ అమలు చేయలేదు. నిబంధనల ప్రకారం హోా ఇవ్వడం సాధ్యం కాదని.. దానికి తగ్గట్లుగా నిధులిస్తామని చెబితే అంగీకరించిన టీడీపీని నిందించారు. ఇప్పుడుఆ హోదా లేదా లేదు.. ప్యాకేజీ లేదు. మెడలు వంచుతామన్న వాళ్లు చేతులు పిసుక్కుంటున్నారు. అయినా ఇప్పుడు కొత్తగా హోదా పేరుతో మోసం చేసేందుకు జేడీ కూడా రెడీ అయ్యారు.
కొత్త రాజకీయాలు చేస్తానన్న ఆయన చివరికి సంప్రదాయ రాజకీయ నేతల్లా ప్రజల్ని మభ్య పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి కబుర్లు చెప్పే రాజకీయ నేతలకు ప్రస్తుతం కొదవ లేదు. వారితో జేడీ పోటీ పడటం సాధ్యం కాదు. ఆయన చెప్పిన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లేలా.. సరికొత్త ప్రయత్నం చేయాల్సింది. తన ఇమేజ్ గొప్పగా ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండి.. ఇప్పుడు జగన్ రెడ్డిని కూడా పొగిడిన తర్వాత ఎవరూ పట్టించుకోని పరిస్థితుల్లో సొంత పార్టీ పెట్టి అవే ప్రకటనలు చేస్తే.. ఏం ప్రయోజనం ?