షారుక్ ఖాన్ సినిమా వస్తోందంటే – బాక్సాఫీసు ఎలెర్ట్ అయిపోతుంది. ఎందుకంటే తను బాలీవుడ్ బాద్ షా! తన సినిమాకి ఎవరైనా దారి ఇవ్వాల్సిందే. కానీ ఇదంతా ఒకప్పటి మాట. దక్షిణాది చిత్రాలు బాలీవుడ్ కి ధీటుగా, పోటీగా తయారవుతున్నాయి. అందుకు సలార్ అతి పెద్ద నిదర్శనం. డంకీ, సలార్ ఒక రోజు వ్యవధిలో విడుదలయ్యాయి. దాంతో ఈ రెండింటి మధ్య పోటీ మొదలైంది. క్రిస్మస్ సీజన్ కాబట్టి… హాలిడేస్‌ని క్యాష్ చేసుకొనే అవకాశం రెండింటికీ దక్కింది. సలార్ కంటే ఒక రోజు ముందే విడుదలవ్వడం డంకీకి కలిసొచ్చింది. అయితే.. సలార్ బరిలో దిగాక పరిస్థితులు మారిపోయాయి. తొలి రోజు వసూళ్లలో డంకీ కంటే సలార్ పది అడుగులు ముందుంది. అసలు వసూళ్లలో ఈ రెండు సినిమాలకూ పోటీనే లేదు.
ఉత్తరాదిన సలార్‌కి తక్కువ థియేటర్లే దక్కాయి. అయితే ఆక్యుపెన్సీ విషయంలో మాత్రం డంకీని డింకీలు కొట్టించింది సలార్. రెండో రోజు ఉత్తరాదిన డంకీకి 50 శాతమే ఆక్యుపెన్సీ దక్కింది. అయితే సలార్ దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీతో డంకీని దాటేసింది. డంకీ తొలి రోజు వసూళ్ల కంటే.. సలార్ ఓపెనింగ్స్ ఎక్కువ. దీన్ని బట్టి ఈ పోటీలో ప్రభాస్ షారుఖ్‌ని దాటేసినట్టు అయ్యింది. డంకీ చెత్త సినిమా ఏం కాదు. బాలీవుడ్ లో మంచి రేటింగులు వచ్చాయి. రాజ్ కుమార్ గత సినిమాల స్థాయిలో లేకపోయినా, క్లాస్ ప్రేక్షకులకు నచ్చింది. అయితే సలార్ మాస్ మూవీ. పుష్ప, కేజీఎఫ్ సినిమాల్ని ఆదరించిన బాలీవుడ్ కి అదే రేంజ్ మాస్, యాక్షన్ డ్రామా సలార్‌లో చూసే అవకాశం వచ్చింది. అందుకే రాబోయే రోజుల్లో కూడా సలార్ డామినేషన్ స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.