కొత్త ఏడాది మరో వారంలో ఆరంభం కాబోతుంది. 2023 పద్దు చూసుకోవాల్సిన తరుణమిది. 2023లో ఎంతోమంది యువ హీరోలు తమ సినిమాలతో సందడి చేశారు. ఇందులో కొందరు విజయాలు అందుకొంటే మరికొందరు అపజయాలు చూశారు. అలా ఈ ఏడాది విజయం అందుకొని హీరోల వివరాల్లోకి వెళితే..
ముందుగా 2023 జనవరిలో కళ్యాణం కమనీయంతో వచ్చాడు సంతోష్ శోభన్. తర్వాత ఇదే ఏడాది తన నుంచి శ్రీదేవి శోభన్ బాబు, అన్ని మంచి శకునములే, ప్రేమ్ కుమార్ సినిమాలు వచ్చాయి. కానీ ఒక్క సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకోలేకపోయింది. ఈ నాలుగు సినిమాల్లో అన్నీ మంచి శకునములే కాస్త అంచనాలు వున్న సినిమా. స్వప్న, వైజయంతి మూవీస్ నిర్మాణంలో రావడం, నందినీ రెడ్డి దర్శకురాలు కావడం ఇవన్నీ సానుకూల అంశాలుగా కనిపించాయి. అయితే సినిమా బాక్సాఫీసు ముందు ప్రభావం చూపించలేకపోయింది.
సుధీర్ బాబు నుంచి ఈ ఏడాది రెండు సినిమాలు వచ్చాయి. జనవరిలో హంట్, అక్టోబర్ లో మామ మచ్చింద్ర. ఈ రెండు ప్రయోగాత్మక చిత్రాలే. హంట్ లో చాలా డేరింగ్ రోల్ చేశాడు. మామ మచ్చింద్ర విషయానికి వస్తే మనం సినిమాకి రచయితగా చేసిన హర్ష వర్షన్ దర్శకత్వం లో కాస్త డిఫరెంట్ స్క్రిప్ట్ చేయాలని మూడు గెటప్ లతో ఓ ప్రయత్నం చేశాడు. కానీ ఈ రెండు నిరాశపరిచాయి. వచ్చే ఏడాది తన నుంచి హరోం హర వస్తుంది.
సందీప్ కిషన్ కి ఈ ఏడాది కూడా కలసి రాలేదు. మైకేల్ పై చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. ఈ గ్యాంగ్ స్టార్ డ్రామా తన కెరీర్ ని మలుపు తిప్పుతుందని ఆశించాడు. కానీ సినిమా మాత్రం నిరాశపరిచచింది. ప్రస్తుతం ఊరు పేరు భైరవ కోన అనే ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఫెబ్రవరి లో సినిమా విడుదలకు సిద్ధమౌతుంది.
కిరణ్ అబ్బవరం నుంచి వినరో భాగ్యం, మీటర్, రూల్స్ రంజన్.. ఇలా మూడు సినిమాలు వచ్చాయి కానీ ఒక్క సినిమాకి హిట్ టాక్ రాలేదు. ఈ మూడిట్లో వినరో భాగ్యం కొంచెం బెటర్. మీటర్ పరమ రొటీన్ సినిమాగా, రూల్స్ రంజన్ కాలం చెల్లిన కథగా విమర్శలు ఎదురుకుంది.
ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, రంగబలి సినిమాలతో వచ్చాడు నాగశౌర్య, ఇందులో ఫలానా.. చిత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. రంగబలి వినోదం ఫస్ట్ హాఫ్ ఆకట్టుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ డీలా పడిపోయింది. ఈ రకంగా కొంచెంలో హిట్ మిస్ చేసుకున్నాడు శౌర్య.
2023 కూడా అఖిల్ కు నిరాశని మిగిల్చింది. చాలా అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అఖిల్. ప్రచారంలో రిస్క్ తీసుకొని స్కై జంప్ కూడా చేశారు. ఐతే అఖిల్ కష్టం వృధా అయ్యింది. ఇక నాగ చైతన్యకు కూడా ఈ ఏడాది థియేట్రికల్ గా కలసి రాలేదు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన కస్టడీ నిరాశపరిచింది. ఓటీటీ వెబ్ సిరిస్ దూతకీ మాత్రం మంచి పేరు వచ్చింది.
వరుణ్ తేజ్ కి కూడా ఈఏడాది కలసి రాలేదు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో చేసిన గాందీవధారి అర్జున డిజాస్టర్ రిజల్ట్ ఇచ్చింది. గోపీచంద్ రామబాణంతో పరాజయాన్ని చూశారు. గోపి, శ్రీవాస్ ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పల్టీ కొట్టింది.
రామ్ పోతినేని కూడా విజయాన్ని అందుకోలేకపోయారు. బోయపాటి దర్శకత్వంలో చాలా అంచనాలతో వచ్చిన స్కంద అంతే భారీ పరాజయాన్ని చూడాల్సివచ్చింది. నితిన్, నిఖిల్ కూడా హిట్ చూడలేకపోయారు. నిఖిల్ స్పై, నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ .. ఈ రెండూ దారుణంగా దెబ్బకొట్టాయి. కార్తికేయ బెదురులంక కాన్సెప్ట్ పరంగా ఓకే అనిపించినా ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయ కోరుకుంటున్న విజయాన్ని అయితే ఇవ్వలేకపోయింది. అల్లరి నరేష్ ఉగ్రం, బెల్లం కొండ గణేష్ నేను స్టూడెంట్ సార్, వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, శ్రీ సింహ భాగ్ సాలె చిత్రాలతో నిరాశపరిచారు.