భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనూహ్యంంగా హిందూత్వ వాదం వినిపి్సతున్నారు. కాంగ్రెస్ హిందూత్వ వ్యతిరేక శక్తిగా మారిందని ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి, జాతీయ మీడియాను సైతం ఆహ్వానించి కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే హిందూ వ్యతిరేక ధోరణి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఆరోపించారు. ఇండియా కూటమిలో ఉన్న డీఎంకే నేతలు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సనాతన ధర్మాన్ని అవమానిస్తూ మాట్లాడినప్పుడు, హిందీ మాట్లాడే రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రలంటూ అవహేళన చేసినప్పుడు కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించారు.
ఆ వ్యాఖ్యల పట్ల రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కర్ణాటలో హిజాబ్ వివాదంపై కూడా రాహుల్ గాంధీ వైఖరిని వెల్లడించాలని అన్నారు. డీఎంకేను కూడా వివాదంలోకి తీసుకొచ్చి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకే పార్టీ నాయకులు విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని కవిత అంటున్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా కొంత మంది నేతలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ఒక రాష్ట్రంలో ఓట్ల కోసం దేశాన్ని అవమానించడం సరికాదని సూచించారు.
ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ జవాబుదారిగా ఉండాలని డిమాండ్ చేశారు. దేశానికి రాహుల్ గాంధీ ఏం సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. హిజాబ్ పై నిషేధాన్ని ఎత్తివేస్తామని ఎన్నికల సమయం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిషేధం ఎత్తివేతపై వెనుకాడుతోందని తప్పుబట్టారు. హిజాబ్ విషయంపై కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలని డిమాండ్ చేశారు. చెప్పింది చేయకపోవడం కాంగ్రెస్ డీఎన్ఏ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర, మభ్యపెట్టడం అని ధ్వజమెత్తారు. గతంలో రామ మందిరంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన కవిత ఇటీవల ప్రశంసిస్తున్నారు.
కవిత తీరు చూస్తే.. బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.