మనసుకు ఆహ్లాదాన్ని పంచే ఔషధం సంగీతం. సినిమా పాట ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు చిత్ర ప్రచారానికి కూడా ఇంధనంగా పని చేస్తుంది. అలా ఈ ఏడాది శ్రోతలని అమితంగా అలరించిన పాటలు కొన్ని వున్నాయి. సినిమాపై బజ్ క్రియేట్ చేసిన పాటలు మరికొన్ని వున్నాయి. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళితే..
2023 మాంచి మాస్ వైబ్ తో ప్రారంభమైయింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి ఆడియో పరంగా కూడా అలరించాయి. వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ, పూనకలు లోడింగ్ పాటలని మాస్ ని ఆకట్టుకునేలా కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్. బాస్ పార్టీ లిరిక్స్ పై కొన్ని మీమ్స్ వైరల్ అయినప్పటికీ చాలా వెరైటీగా ఆ పాట జనాల్లోకి వెళ్ళింది. థియేటర్స్ లో ఆ పాటని బాగానే ఎంజాయ్ చేశారు. పూనకలు లోడింగ్ పాటలో చిరంజీవి, రవితేజ కలిసి చేసిన సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్స్ బాగా వైరల్ అయ్యింది.
వీరసింహ రెడ్డి కోసం తమన్ మాంచి మాస్ బీట్లు ఇచ్చాడు. ముఖ్యంగా జై బాలయ్య పాట మార్మోగిపోయింది. అదొక మాస్ ఆంధమ్ గా అలరించింది. రామజోగయ్య శాస్త్రి బాలయ్య అభిమానులకు పూనకలు తెప్పించే లిరిక్స్ రాశారు. ‘మా బావ మనోభావాలు’ పాట కూడా అలరించింది. ఇక ఇదే ఏడాది బాలయ్య భగవంత్ కేసరిలో ఉయ్యాలో ఉయ్యాల లాంటి చక్కటి మెలోడీని కంపోజ్ చేశాడు తమన్. ఈ లాలి పాటకు అనంత్ శ్రీరామ్ రాసిన సాహిత్యం, ఎస్పీ చరణ్ గాత్రం మరింత ఆకర్షణని తీసుకొచ్చాయి.
ధనుష్ ‘సార్’ సినిమా మాస్టరు మాస్టారు పాట చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ట్యూన్ తమిళ్ లో కంటే తెలుగులో మరింతగా ప్రజాదరణ పొందింది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శ్వేతా మోహన్ గానం మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి. పాపులర్ కాలర్ ట్యూన్ గా కూడా ఈ పాట అలరిచింది.
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించింది బలగం. ఈ సినిమాలో ఊరు పల్లెటూరు పాట మంచి జనాదరణ పొందింది. బీమ్స్ అందరినీ ఆకట్టుకునే క్యాచి ట్యూన్ ఇచ్చాడు. కాసర్లశ్యామ్ పల్లెటూరి ఆత్మని ప్రతిబింబించే సాహిత్యాన్ని అందించాడు.మంగ్లీ, రామ్ మిర్యాల పాటని మరో స్థాయికి తీసుకెళ్ళారు. ఈ సినిమా విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది.
విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కి చిత్రంలో ‘ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా’ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమా ప్రచారంలో ఆ పాట చాలా ఉపయోగపడింది. ఈ పాట సోషల్ మీడియాలో రిల్స్ గా తెగ సందడి చేసింది.
నాని దసరా ఆల్బమ్ లోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంతోష్ నారాయణ్ కంపోజ్ చేసిన ఈ ఆల్బంలోని చమ్కీలా అంగీలేసి పాట చాలా వైరల్ అయ్యింది. ట్యూన్ తో పాటు కాసర్ల శ్యామ్ లిరిక్స్ ప్రత్యేకంగా నిలిచాయి. అన్నట్టు ఈ పాట సోషల్ మీడియాలో ‘మీమ్ గాడ్ బ్రాహ్మి’ వీడియో క్లిప్స్ తో ఎడిట్ చేసి వెర్షన్ విపరీతంగా పాపులర్ అయ్యింది.
హారర్ థ్రిల్లర్ గా వచ్చిన విరూపాక్షలో మంచి మెలోడీ కుదిరింది. అజనీష్ లోక్నాథ్ స్వరపరిచిన ‘నచ్చావులే’ పాట మెలోడీ హిట్ గా నిలిచింది. సింగర్ కార్తి కార్తిక్ తనదైన వాయిస్ తో ఈ పాటకు మరింత సొగసుని జోడించాడు. ఇందులో హీరోయిన్ పాత్రలో ఒక ట్విస్ట్ వుంటుంది. ఈ పాటలో దానికి సంబధించిన సాహిత్యం వినిపిస్తుంది.‘’పద్దతే పరికిణిలోనే వున్నదా అన్నట్టుందే.. అమ్మడు.. నమ్మితే.. తప్పునాదే.. నన్నింతలా ఏ మార్చిన ఆ మాయ నీదే’’ ఈ లైన్స్ సరిగ్గా గమనిస్తే హీరోయిన్ క్యారెక్టర్ పై ఒక ఐడియా వచ్చేస్తుంది. అయితే దిన్ని ఒక రొమాంటిక్ పాటగానే ప్రేక్షకులని డైవర్ట్ చేయడంలో దర్శకుడు మంచి ప్రతిభ కనబరిచాడు. ఈ సినిమా తొలిసారి చూసినప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ని దాదాపుగా ఎవరు గెస్ చేయలేకపోయారు.
సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి పాట ఒక ప్రధాన ఇంధనం అనడానికి ఉదాహరణ ‘బేబీ’ సినిమా. ఇందులో ఓ రెండు మేఘాలై పాట ఒక ఊపు ఊపింది. ఎక్కడ విన్నా ఇదే పాట వినిపించింది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం యువతని కట్టిపడేసింది. శ్రీరామ్ చంద్ర చాలా రోజుల తర్వాత మెస్మరైజ్ చేసాడు. విజయ్ బుల్గానిన్ కంపోజిషన్ అందరికీ కనెక్ట్ అయ్యింది. ముఖ్యంగా పాట బిగినింగ్ లో పిల్లలతో పాడించిన కోరస్ భలే క్యాచిగా కుదిరింది.
విజయ్ దేవర కొండ ఖుషి, నాని హాయ్ నాన్న చిత్రాలతో రెండు డీసెంట్ ఆల్బమ్స్ ఇచ్చాడు హేషామ్ అబ్దుల్ వహాబ్. ఖుషిలోని ఆరాధ్య, నా రోజా నువ్వే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పై బజ్ క్రియేట్ కావడానికి పాటలు ఎంతగానో సహకరించాయి. ఇక నాని హాయ్ నాన్న కూడా అంతే. సమయమా, గాజుబొమ్మ, అమ్మాడి పాటలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది మెలోడీకి పెద్దపీట వేసిన సంగీత దర్శకుడిగా హేషామ్ ఆకట్టుకున్నాడు.
రామ్ స్కంద కోసం నీ చుట్టూ, గండబాయ్ లాంటి రెండు మాస్ డ్యాన్స్ సాంగ్ ని అందించాడు తమన్. సినిమా విజయాన్ని అందుకోలేకపోయినప్పటికీ ఈ రెండు పాటలు మాత్రం థియేటర్స్ లో అలరించాయి. కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ లోని సమ్మోహనుడా పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రేయ ఘోషల్ స్వీట్ వాయిస్ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.
రన్బీర్ కపూర్ యానిమల్ విడుదల తర్వాత అనూహ్యంగా ఓ బిట్ సాంగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపొయింది. అబ్రార్ పాత్ర ఎంట్రీలో వచ్చే జమాల్ కుడు పాట రీల్స్ లో తెగ తిరిగేసింది.
కోటబొమ్మాలి పీఎస్ సినిమాలో లింగిడి పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. శ్రీకాకుళం జానపదం మూలం నుంచి తీసుకున్న ఈ పాటని మాంచి బీట్ జోడించి సినిమా పాటగా మార్చారు. సినిమా ప్రమోషన్స్ కి ఈ పాట బాగా కలిసొచ్చింది.