ఈ సంక్రాంతికి ఏకంగా 5 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒకటో రెండో వెనక్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ సినిమాలేమిటన్నది ఇంకా నిర్దారణ కాలేదు. అందరికీ సంక్రాంతి కావాలి. కాకపోతే.. అన్ని సినిమాలకూ థియేటర్లు దొరకవు. పెద్ద సినిమాలు కబళిస్తే.. ‘హనుమాన్’లాంటి చిన్న సినిమాలకు చోటు లేకుండా పోతుంది. కనీసం ఒక సినిమా వాయిదా పడినా, ఏదోలా సర్దుకుపోవొచ్చు. కాకపోతే.. సంక్రాంతి సీజన్‌ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాతలందరి తరపున దిల్ రాజు ఓ తాయిలం ప్రకటించారు. ఈ సంక్రాంతి రేసులో ఉన్న సినిమాల్లో ఏ ఒక్కటి వెనక్కి తగ్గినా – వాళ్లకు సోలో రిలీజ్ ఛాన్స్ ఇస్తామని వరం ఇచ్చేశారు.
సంక్రాంతికి 5 సినిమాలొస్తే.. థియేటర్లు దొరకవని, అందుకే నిర్మాతలందరితోనూ మాట్లాడుతున్నామని, ఎవరైనా వెనక్కి వెళ్తామని చెబితే, వాళ్లకు సోలో రిలీజ్ వచ్చేలా చూస్తామని దిల్ రాజు ప్రకటించారు. పరిశ్రమలో దిల్ రాజు మాట చెల్లుబాటు అవుతుంద కాబట్టి, సోలో రిలీజ్‌కి ఆశ పడేవాళ్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. జనవరి 26, ఫిబ్రవరి 2.. ఈ తేదీలన్నీ ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాయి. సంక్రాంతి మిస్ అయితే.. జనవరి 26 మంచి ఆప్షన్. సంక్రాంతికి అందరితో పాటు రావాలా, లేదంటే.. జనవరి 26న సోలోగా వచ్చిన సొమ్ము చేసుకోవాలా? అనేది ఇప్పుడు నిర్మాతల చేతుల్లో ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ‘హనుమాన్’ వాయిదా పడే అవకాశం ఉంది. ఎందుకంటే హనుమాన్ 12న వస్తోంది. అదే రోజు.. గుంటూరు కారం విడుదలకు సిద్దమైంది. మహేష్ తో పోటీ అంటే రిస్క్ ఎక్కువ. హనుమాన్ వెనక్కి వెళ్తే… సోలోగా జనవరి 26న రావొచ్చు. ఇప్పటికే ‘హనుమాన్’కి మంచి బజ్ ఉంది. సోలోగా వస్తే.. హనుమాన్ కే ఎక్కువ అడ్వాంటేజ్ దక్కుతుంది. హనుమాన్ వాయిదా పడితే… గుంటూరు కారం, నాసామి రంగ, ఈగల్, సైంధవ్ బరిలో మిగులుతాయి.