ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రధాని మోడీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేసిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని కలుస్తారు. సహకారం కోరుతారు. రేవంత్ రెడ్డి కూడా అదే మాదిరిగా అపాయింట్ మెంట్ అడిగారు. ఇప్పుడు ఖరారు కావడంతో ఢిల్లీ వెళ్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత తొలిసారిగా సీఎం… ప్రధానిని కలవనుండటంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
తెలంగాణకు రావాల్సిన నిధుల్లో కొంత వచ్చినా రిలీఫ్ ఉంటుందని భావిస్తున్నారు. పద్నాలుగు, పదిహేనో ఆర్థిక సంఘాల సిఫారసుల మేరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు, వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ఆర్థిక సాయాలు, మిషన్ భగీరథ నిర్వహణ కోసం పదిహేనో ఆర్థిక సంఘం సిఫారసులు, చెరువుల పునరుద్ధరణ కోసం నీతి ఆయోగ్ చేసిన సూచనలు, స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు అడిగే అవకాశం ఉంది. అయితే ఈ నిధులన్నీ గతంలో బీఆర్ఎస్ సర్కార్ అడిగింది. కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం చెబుతూ వస్తోంది. నిధులు విడుదల చేసేలా రేవంత్ అంగీకరింప చేస్తే అదే పెద్ద విజయం అయ్యే అవకాశం ఉంది.
ప్రధానితో భేటీ అనంతరం ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం సమావేశం కానున్నారు. అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమాలను ఆయన పార్టీ పెద్దలకు వివరించనున్నారు. నామినెటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన వారితో చర్చించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.