2023 క్యాలెండర్‌లో చివరి రోజుల్లో ఉన్నాం. ఈ యేడాదంతా మిశ్రమ ఫలితాల్ని చూసింది టాలీవుడ్. డిసెంబరులో మాత్రం ‘సలార్’ పుణ్యాన ఓ సూపర్ హిట్ దక్కింది. ఇప్పుడు ఈ యేడాది చివరి వారంలోకి దిగిపోయాం. ఈ వారం రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఒకటి.. ‘డెవిల్’, మరోటి ‘బబుల్ గమ్’.
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘డెవిల్’ మంచి అంచనాలే ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొంటున్నాయి. నేపథ్యం కూడా కొత్తగా అనిపిస్తోంది. ఇదో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ కథ. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగబోతోంది. ఈ తరహా చిత్రాలకు ఇటీవల మంచి ఆదరణ దక్కుతోంది. కల్యాణ్ రామ్ గెటప్, ఆ సెటప్ అన్నీ ఆకట్టుకొంటున్నాయి. యాక్షన్‌కి పెద్ద పీట వేశారు. కల్యాణ్ రామ్ అండ్ డీమ్ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.
‘డెవిల్’తో పాటుగా చిన్న సినిమా ‘బబుల్ గమ్’ విడుదల అవుతోంది. సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ‘క్షణం’ లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించారు. ట్రైలర్ చూస్తుంటే ఇది కుర్రాళ్ల సినిమా అనేది అర్థమైపోతోంది. వాళ్లకు నచ్చితే సినిమాని నెత్తిమీద పెట్టుకొంటారు. రోషన్‌లో కూడా ఈజ్ కనిపిస్తోంది. పాటలూ ఓకే అనిపించాయి. మరీ అంత లైట్ తీసుకొనే సినిమా కాదిది. మరి… ఈ రెండు సినిమాలకూ టికెట్లు తెగితే 2023ని దిగ్విజయంగా ముగించినట్టే. కాకపోతే సలార్ వేడి ఇంకా చల్లార లేదు. ఈ వారం కూడా సలార్ ప్రభావం బాక్సాఫీసుపై గట్టిగా ఉండే అవకాశం ఉంది. సలార్ ధాటిని ఈ రెండు సినిమాలూ ఎంత వరకూ తట్టుకొంటాయో చూడాలి.