పరిశ్రమలో విజయం చాలా అపూర్వం. ఒక్క హిట్టు వచ్చినా ఆ ఉత్సాహంతో ప్రయాణాన్ని చాలా దూరం కొనసాగించవచ్చు. పదేళ్ళ క్రితం హిట్ పడినా ఆ ఫలానా హిట్ తోనే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు వెలుగులో ఉండటానికి ప్రయత్నిస్తారు. విజయంలో తమ భాగస్వామ్యం వుందని చెప్పడానికి తపన పడతారు. అయితే అలాంటి విజయాన్ని అందుకున్న ఓ దర్శకుడు విజయోత్సవ వేడుకలో కనిపించకపోవడం, పాల్గొన్న ఒక్కరు కూడా ఆ దర్శకుడు పేరు కూడా తలచుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.
‘ధమాకా’తో రవితేజకి మాస్ హిట్ ని అందించాడు దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన. 2022 చివర్లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న రవితేజకి మంచి ఊరటనిచ్చింది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో జోష్ నింపింది. ధమాకా విడుదలై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంలో నిర్మాణ సంస్థ ఓ వేడుకని నిర్వహించింది. ఈ వేడుకలో దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన కనిపించలేదు. బేసిగ్గా ఇలాంటి వేడుకల్లో దర్శకుడు తప్పకుండా వుంటారు. పోనీ సినిమా షూటింగ్ లో బిజీనా అంటే.. ధమాకా తర్వాత ఆయన నుంచి కొత్త సినిమా ప్రకటన రాలేదు.
ఇక వేదికపై మాట్లాడిన రవితేజ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా త్రినాథ్ రావు గురించి ప్రస్థావించలేదు. సంగీత దర్శకుడు, కెమరామ్యాన్, ఇలా అందిరి గురించి చెప్పిన రవితేజ.. సినిమా కెప్టెన్ పేరు వదిలేశారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ సహజంగానే చాలా తక్కువ మాట్లాడతారు. ఆయన థాంక్స్ ని కేవలం రవితేజకే పరిమితం చేశారు. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియగా నిలిచిన రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కూడా ఎక్కడా కనిపించలేదు. మొత్తానికి దర్శకుడు లేకుండానే ధమాకా ఏడాది పండగ జరిగిపోయింది. మరి ఈ వేడుకకు దర్శకుడు రావడం కుదరలేదా? లేదా కావాలనే సైడ్ చేశారా అనేదే బిలియన్ డాలర్ల ప్రశ్న.