ఏపీలో రాజకీయం వన్ సైడ్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తూండటంతో వైసీపీలో ఉన్న నేతలు తమ పాత పరిచయాల్ని పట్టుకుని టీడీపీలోనో.. జనసేనలోనో చేరేందుకు ముందుగానే ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో ఎలాగూ చాన్స్ రాదు. కూటమిలో భాగంగా ఎక్కడైనా చాన్స్ వస్తే అంత కంటే జాక్ పాట్ ఉండదని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పీఆర్పీలో పని చేసి ప్రస్తుతం వైసీపీలో ఉన్న అనేక మంది నేతలు పవన్ తో టచ్ లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నరు.
తాజాగా వీరిలో ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ పేరు బయటకు వచ్చింది. వంశీకృష్ణ శ్రీనివాస్ 2009లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఓడిపోయారు. ప్రజారాజ్యంలో పని చేసిన సమయంలోనే పవన్ కల్యాణ్‌తో పరిచయాలు ఉన్నాయి. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో .. ఆ పార్టీ ఉనికి కోల్పోవడంతో చివరికి వైసీపీలో చేరారు. ఆయనకు 2014లో మరోసారి తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో వైసీపీ అధినేత టిక్కెట్ కేటాయించలేదు.
కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించి మేయర్ ను చేస్తామని బుజ్జగించారు. కార్పొరేటర్ గా పోటీ చేయించారు. కానీ..మేయర్ పదవి కూడా ఇవ్వలేదు. దాంతో ఆయన అసంతృప్తికి గురైనా.. మిన్నకుండిపోయారు.ఆయనను బుజ్గగించడానికి తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదు. ఎమ్మెల్సీ అయినా ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోవడంతో ఆయన మాట వినేవారు లేరు. దీంతో జనసేనలో చేరితే పొత్తులో భాగంగా ఎక్కడైనా సీటు లభించే అవకాశం ఉందని.. ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పవన్ తో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయి.