ఏపీ రాజకీయాల్లోకి రావాలని షర్మిల డిసైడ్ అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు పంపడంతో.. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని వచ్చే వారమే విలీనం చేసి ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఎన్నికల కోసం రెండు నెలల్లో పార్టీని సిద్ధం చేయనున్నట్లుగా తెలుస్తోంది. పలితాలు ఎలా ఉన్నా పార్టీ పుంజుకుందన్న అభిప్రాయం కల్పిస్తే చాలని..భవిష్యత్ రాజకీయాలకు ఇది చాలా ముఖ్యమని షర్మిలతో పాటు కాంగ్రెస్ కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
షర్మిల అన్నకు అడ్డం రాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే చూసుకుందామనుకున్నారు. కానీ తెలంగాణ రాజకీయాల్లోకి ఆమెకు స్పేస్ లేదని తేలిపోయింది. దీంతో మెల్లగా ఏపీ వైపు దృష్టి సారించారు. తాను సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుందో కానీ.. తన తండ్రికి ఉన్నత స్థానం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయితే బాగుంటుందని ఆమె అనుకుంటున్నారు. ఆ దిశగా చర్చలు ప్రారంభించి ఫైనల్ చేసుకున్నారు. ఎన్నికల తర్వాత ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపడితే ఎవరికి నష్టమన్నది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అయిన దళితులు, ముస్లింలు , కన్వర్టడ్ క్రిస్టియన్స్ పూర్తిగా జగన్ వైపు ఉన్నారు. షర్మిలను చూసి నాలుగైదు శాతం మంది కాంగ్రెస్ వైపు వెళ్లినా ఆ ప్రభావం.. జగన్ రెడ్డిపై తీవ్రంగా ఉంటుంది. అదే సమయంలో జగన్ రెడ్డి టిక్కెట్లు నిరాకరిస్తున్న ఎమ్మెల్యేలకు ఓ ఫ్లాట్ ఫాం దొరికినట్లవుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే.. షర్మిల ఏపీ రాజకీయంపై ఎక్కువగా వైసీపీ వర్గాలు టెన్షన్ పడుతున్నాయి.