కల్యాణ్ రామ్ కొత్త సినిమా డెవిల్ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా కోసం కోసం నవీన్ మేడారం అనే కుర్రాడ్ని దర్శకుడిగా తీసుకోవడం, ఆ తరవాత అతన్ని పక్కన పెట్టేసి నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం తెలిసిన విషయాలే. అసలు నవీన్ని ఎందుకు పక్కన పెట్టారు? అనే ప్రశ్నకు ఇంత వరకూ ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆఖరికి కల్యాణ్ రామ్ కూడా ఈ ప్రశ్నను స్కిప్ చేసేశాడు.
‘డెవిల్’కి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలైపోయాయి. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మీడియాని పిలిచి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. అయితే ఎక్కడా దర్శకుడి మార్పుకి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడలేదు కల్యాణ్ రామ్. ”ఈ ఒక్క ప్రశ్న తప్ప ఏదైనా అడగండి” అని కల్యాణ్ రామ్ చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారిపోయింది. ”ఈ ప్రశ్నకు నాకంటే నిర్మాత కమ్ దర్శకుడు అభిషేక్ నామాని అడగండి. ఆయనే సరైన సమాధానం చెబుతారు” అంటూ దాటవేశాడు కల్యాణ్ రామ్.
అన్నట్టు ‘డెవిల్ 2’ కి సంబంధించిన కథ కూడా రెడీగా ఉందట. డెవిల్ హిట్టయితే.. పార్ట్ 2 చేస్తామని కల్యాణ్ రామ్ హింట్ ఇచ్చాడు. అయితే పార్ట్ 2కి సంబంధించిన లీడ్ మాత్రం ‘డెవిల్’లో ఇవ్వలేదట. ‘బింబిసార 2’ కూడా ఉందని, ఆ సినిమా పూర్తయ్యాకే ‘డెవిల్ 2’ గురించి ఆలోచిస్తామని కల్యాణ్ రామ్ క్లారిటీగా చెప్పేశాడు.