‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఎన్టీఆర్ నుంచి మరో సినిమా రాలేదు. ‘దేవర’ కోసమే తారక్ అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా మొదలై చాలాకాలం అయ్యింది. దాదాపు 80 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యిందని నిర్మాత కల్యాణ్ రామ్ ప్రకటించేశారు. మరి టీజర్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది.
‘దేవర’ టీజర్ రెడీ అయిపోయింది. కొత్త యేడాదిని పురస్కరించుకొని జనవరి 1న గానీ, డిసెంబరు 31న గానీ విడుదల చేసే అవకాశం ఉంది. టీజర్‌కి సంబంధించి ఆర్.ఆర్ కూడా పూర్తయిపోయింది. సంగీత దర్శకుడు అనిరుథ్ చేసిన ట్వీట్ తో దేవర టీజర్‌కు సంబంధించిన హింట్ దొరికేసింది. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ‘దేవర టీజర్… ఎగ్జైటెడ్’ అంటూ ఫైరింగ్ ఎమోజీలతో అనిరుథ్ ఓ ట్వీట్ చేశాడు. దాంతో.. ఈ టీజర్ రెడీ అయిపోయిందన్న సంకేతాలు అందేశాయి. చిత్రబృందం మాత్రం ‘దేవర’ టీజర్ రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఈనెల 29న ‘డెవిల్’ విడుదల కానుంది. ఆ తరవాతే.. ఈ సినిమా టీజర్‌పై నిర్మాత కల్యాణ్ రామ్ ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.