వివాదాలు, విమర్శలు తెలుగు చిత్రసీమకు కొత్తేం కాదు. విజయాలు ఉన్న చోట.. అవి కూడా ఉంటాయి. ఈ ఏడాది కూడా విజయాలతో పాటు కొన్ని వివాదాలనీ కూడా చూసింది తెలుగు పరిశ్రమ. హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా సంచలనమైయింది. స్వయంగా అమితాబ్ బచ్చన్ దీనిపై తన స్వరాన్ని బలంగా వినిపించారు. తర్వాత సినీ పరిశ్రమ అంతా రష్మిక కు అండగా నిలబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మార్ఫింగ్ వీడియోను వివిధ సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్లోడ్ చేసిన దుండగులని ట్రాక్ చేసే పనిలో వున్నారు పోలీసులు.
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలోని కొన్ని వేషధారణలు, డైలాగులు దేశవ్యాప్తంగా చర్చనీయంశమైయ్యాయి. కొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. తర్వాత వివాదానికి కారణమైన సంభాషణలు మారుస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టత ఇచ్చింది.
వీరసింహ రెడ్డి సక్సెస్ మీట్ లో బాలకృష్ణ .. ‘అక్కినేని.. తొక్కినేని.. ఆ రంగారావు , ఈ రంగారావు’ అని ఫ్లోలో చేసిన ఓ కామెంట్ వివాదం అయ్యింది. దీనిపై అక్కినేని హీరోలు నాగ చైతన్య, అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెద్దలని అలా అవమానించడం తగదని చెప్పారు. ఎస్వీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం బాలకృష్ణ వాఖ్యల్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎన్టీఆర్, ఎస్వీఆర్ కుటుంబ సభ్యుల మధ్య మంచి అనుబంధం ఉందని, తామంతా ఒకే కుటుంబంలా ఉంటామని, తోటి నటుడితో జరిగిన సంభాషణ గురించి ఆయన చాలా జనరల్ గా చెప్పారని, ఈ విషయంలో తమకు, తమ కుటుంబ సభ్యులకు ఎలాంటి వివాదం కనిపించ లేదని ఎస్వీఆర్ మనవళ్లు రంగారావు, ఎస్.వి.ఎల్.ఎస్ రంగారావు చెప్పుకొచ్చారు. దీంతో ఆ వివాదం ముగిసింది.
ఈ ఏడాది మంచు బ్రదర్స్ మధ్య వున్న లుకలుకలు బయటపడ్డాయి. మంచు మనోజ్ అనుచరుడు ఇంటికి విష్ణు వచ్చి అతన్ని కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ ఒక వీడియో షేర్ చెయ్యడం పెద్ద వివాదం అయింది. మంచు సోదరుల మధ్య బంధం బాలేదని ఎప్పటి నుంచో వార్తల్లో వుంది, కానీ ఈ వీడియోతో గొడవలు రోడ్డుకెక్కాయి. అయితే దీనిని ఒక చిన్నపాటి సంఘటనగా కొట్టి పారేశారు మోహన్ బాబు.
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో తన పాత్రని అనుకరించారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి వివాదాన్ని రేపారు. ప్రెస్ మీట్ వరకూ ఓకే కానీ.. ఒక క్యాబినెట్ మినిస్టర్ హోదాలో సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి ఆ సినిమా రివ్యూ చెప్పడం, దాని కలెక్షన్స్ వివరించడం.. ఇవన్నీ ఆయనకే అప్రతిష్ట తీసుకొచ్చాయి. దీంతో కొనాళ్ళుకు ఆయనే సైలంట్ అయిపోయారు.
నరేష్ రెండో పెళ్లి కూడా ఈ ఏడాది బాగా వైరల్ అయిన అంశాల్లో ఒకటి. రమ్య రఘుపతికి దూరంగా ఉంటున్న నరేష్.. నటి పవిత్ర లోకేష్ కు దగ్గరయ్యారు. అయితే రమ్య రఘుపతి మీడియా స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించి ఓ హోటల్ విజువల్స్ ని పబ్లిక్ చేసింది. దీంతో నరేష్ కూడా వెనక్కి తగ్గలేదు. అదే ఎపిసోడ్ పై ‘మళ్ళీ పెళ్లి’ అని ఏకంగా ఓ సినిమా తీసి వదిలేశారు. ఈ సినిమాపై రమ్య కోర్టుకి వెళ్ళినప్పటికీ లాభం లేకుండాపోయింది. సినిమా విడుదలై డిజాస్టర్ అయినప్పటికీ తన ఈగోని తృప్తి పరుచుకున్నాడు నరేష్.
త్రిష పై నటుడు మన్సూర్ చేసిన ‘రేప్’ వ్యాఖ్యలు కలకలం రేపాయి. లియో సినిమాలో త్రిష్ తో రేప్ సీన్ లో నటించే అవకాశం లేకపోవడం నిరాశపరిచిందని మన్సూర్ చేసిన వాఖ్యాలని సమాజం అంతా తప్పుపట్టింది. ఈ వివాదంలో చిరంజీవి, త్రిషకు అండగా నిలబడ్డారు. అయితే ఈ వివాదంలో చిరంజీవి తనపై చేసిన వ్యాఖ్యలు తనని కించపరిచాయని చిరుపై పరువు నష్టం దావా వేశాడు మన్సూర్. ఆ రకంగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
సంతోషం పత్రిక ఎడిటర్ సొంతగా నిర్వహించుకునే వేడుకలు టాలీవుడ్ ని హెడ్ లైన్స్ లో నిలిపాయి. గోవాలో జరిగిన ఈ వేడుకల్లో తమకు సరైన వసతులు కల్పించలేదని కన్నడ, తమిళ పరిశ్రమకు చెందిన తారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకుడు టాలీవుడ్ చెందిన వాడు కావడం, పైగా మెగా పీఆర్వో అనే ట్యాగ్ వుండటంతో ఈ విషయాన్ని తెలుగు పరిశ్రమ ఆపాదించినట్లయింది. స్వయంగా అల్లురవింద్ దీనిపై స్పష్టత ఇచ్చారు. మెగా హీరోలకు ఎవ్వరూ పీఆర్వో లేరు. అది అతడి వ్యక్తితం అని చెప్పారు. దీంతో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడింది.