‘డెవిల్’ సినిమా విషయంలో ఓ కాంట్రవర్సీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నవీన్ మేడారం దర్శకుడు. అయితే ఇప్పుడు ప్రచార చిత్రాల్లో మాత్రం దర్శకుడిగా అభిషేక్ నామా పేరు కనిపిస్తోంది. నవీన్ని పక్కన పెట్టి, నిర్మాతే దర్శకుడిగా మారడం, దర్శకుడికి క్రెడిట్ ఇవ్వకపోవడం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. అసలు నవీన్ విషయంలో ఏం జరిగింది? అని కల్యాణ్ రామ్ ని అడిగినా, ఆయన సమాధానం చెప్పడం లేదు. ‘ఇదంతా అభిషేక్ నామా తేల్చాల్సిన విషయం’ అంటూ బంతిని నిర్మాత కోర్టులో వేశారాయన. నిర్మాత అభిషేక్ ఈ విషయమై స్పందిచాల్సివుంది.
ఇప్పుడు నవీన్ మేడారం నోరు విప్పాడు. ట్విట్టర్ వేదికగా ఓ నోట్ విడుదల చేశాడు నవీన్. తన మూడేళ్ల కష్టం ఈ సినిమా అని, ప్రతీ చిన్న విషయంలోనూ తను శ్రద్ధ తీసుకొన్నానని, ఇది సినిమా కాదని, తన బిడ్డ అని – ఎమోషనల్ అయిపోయాడు నవీన్ మేడారం. దాదాపు 105 రోజుల పాటు షూటింగ్ చేశానని, చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు మినహా సినిమా అంతా తానే పూర్తి చేశానని, కొన్ని ఈగో కారణాల వల్ల తనకు క్రెడిట్ దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకాలం తను నిశ్శబ్దంగా ఉన్నానని, అయితే తన మౌనాన్ని చేతకాని తనం అనుకొంటున్నారని, అందుకే స్పందించాల్సివచ్చిందని ఆ నోట్ లో పేర్కొన్నాడు నవీన్. తను ఈ ప్రాజెక్ట్ విషయంలో చిన్న తప్పు కూడా చేయలేదని, అయితే ఈ విషయమై ఎవరిపైనా లీగల్ గా చర్యలు తీసుకొనే ఉద్దేశం లేదని నవీన్ స్పష్టం చేశాడు. మరోవైపు కల్యాణ్ రామ్కి కూడా కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు నవీన్. కల్యాణ్ ఈ సినిమాకి వంద శాతం ఎఫెక్ట్ పెట్టారని, తనకు పూర్తి సహాయ సహకారాలు అందజేశాడని అన్నారు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. తను ఈ సినిమా నుంచి మూవ్ ఆన్ అయిపోయానని, మరో సినిమా పనిలో బిజీగా ఉన్నానని స్పష్టం చేశాడు.
మొత్తానికి నవీన్ నోట్ తో.. ‘డెవిల్’ వివాదం కాస్త సద్దుమణిగినట్టే. కాకపోతే.. అసలు తప్పెవరది? ఏం జరిగింది? అనే విషయాల్లో మాత్రం క్లారిటీ రావాల్సివుంది.