ఉద్యమవేడిలో సింగరేణిలో జై తెలంగాణ అనిపించి… పాతుకుపోయిన కాంగ్రెస్, వామపక్షాల కార్మిక సంఘాల్ని కూడా కాదని సొంత సంఘాన్ని స్థాపించుకుని విజయం సాధించింది. తెలంగాణ బొగ్గు గని సంఘం పేరుతో గుర్తింపు సంఘంగా కూడా రెండు సార్లు గెలిచింది.కానీ ఇప్పుడు ఆ సంఘం ఉనికి ప్రశ్నార్థకమయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీకి కనీస ఓట్లు కూడా రాలేదు.
సింగరేణి గుర్తింపు సంఘంగా సీపీఐ అనుబంధ సంఘం… ప్రాతినిధ్య సంఘంగా కాంగ్రెస్ అనుబంధ సంఘం గెలిచాయి. బీఆర్ఎస్ అనుబంధ సంఘం మాత్రం అసలు రేసులో లేకుండాపోయింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పాలని అనుకున్నారు. కవిత గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు కూడా. అందుకే ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ చివరికి ఘోరపరాజయం ఎదురయింది.
అధికారం పోవడం, సెటిమెంట్ లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయకూడదని కేసీఆర్ అనుకున్నారు. కానీ కవిత పట్టుదలతో పోటీ చేియంచారు. అయినా చాన్స్ లేకపోవడంతో ఎన్నికలకు ముందే కీలక నేతలు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీల్లో చేరారు. గనుల వద్ద ఎక్కడా కూడా గులాబీ జెండా కనిపించలేదు. ఆ సంఘం ఎన్నికల చిహ్నమైన బాణం గుర్తుపై ఓటు వేయాలని కోరేవారు కూడా కనిపించలేదు.
ఉద్యమవేడిలో అందర్నీ ఏకం చేసిన కేసీఆర్ ఇప్పుడు… ఆ పట్టును పూర్తిగా కోల్పోతున్నారు. అధికారం పోవడంతో.. తెలంగాణ రాష్ట్ర సమితి నీడలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాలు కూడా.. నిర్వీర్యమవుతున్నాయి.