భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సవాల్‌గా మారాయి. ఈ సారి అధికారంలో లేదు. ఘోర పరాజయాన్ని ఎదుర్కొని.. ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళ్తుంది. ఓ వైపు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్.. మోదీ మానియా ఇంకా ఉందని హడావుడి చేస్తున్న బీజేపీలను తట్టుకోవడం బీఆర్ఎస్కు అంత సులువు కాదు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా అంగీకరించారు. రెండు జాతీయ పార్టీల నుంచి గట్టి పోటీ ఉంటుందన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకంగా జరుగుతున్నందున ఇప్పుడు ఓటింగ్ ప్రయారిటీ ఖచ్చితంగా జాతీయ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలన్న టాపిక్ మీద ప్రజలు ఓట్లేస్తారు. మోదీ మూడో సారి ప్రధానిగా కొనసాగాలా లేకపోతే రాహుల్ గాందీకి చాన్సివ్వాలా అన్న చాయిస్ పరంగా ఓటింగ్ జరుగుతుంది. మరీ ఈ చాయిస్ లో బీఆర్ఎస్ ప్రస్తావన రావడానికి అవకాశం లేదు. మరి ఓటింగ్ ఎలా వస్తుంది. హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఓటర్లు అయితే ఓట్లు వేస్తారు. కానీ వారితో డిపాజిట్లు అయినా వస్తాయన్న గ్యారంటీ ఉండదు.
ఇప్పుడు బీఆర్ఎస్ ముందు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణకు న్యాయం చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని ప్రజల్ని కన్విన్స్ చేయడం. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని జాతీయ పార్టీల చేతుల్లోకి తెలంగాణ వెళ్తే ఆగమవుతుందని ఎంతగా చెప్పినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. అందుకే బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. ?
లోక్‌సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించకపోతే.. రెండు జాతీయ పార్టీలు మీదపడిపోతాయి. బీఆర్ఎస్ ను బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాయి. అందుకే బీఆర్ఎస్ కు ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు అత్యంత విషమ పరీక్ష. గెలవకపోతే.. పార్టీని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది.