మాజీ మంత్రి మరియు మాజీ వైకాపా నేత కొణతాల రామకృష్ణ వైకాపాను విడిచిపెట్టి అప్పుడే రెండేళ్ళు పూర్తికావస్తున్నా ఇంతవరకు ఏ పార్టీలోను చేరలేదు. ఆయన తెదేపాలో చేరుతారని మీడియాలో చాలాసార్లు వార్తలు వచ్చేయి కానీ స్థానిక తెదేపా నేతల అభ్యంతరాల కారణంగా చేరలేకపోయినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన సన్నిహితుడు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి స్వయంగా తాము ఈ మార్చి నెలలోనే తెదేపాలో చేరబోతున్నట్లు నిన్న మీడియాకు చెప్పారు కనుక ఈసారి వాళ్ళ బ్యాచ్ తెదేపాలో చేరిక ఖాయమనే నమ్మవచ్చును.
ఆయన మరో బాంబు లాంటి వార్తను కూడా పేల్చారు. తమతో బాటు అరుకు వైకాపా ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు కూడా తెదేపాలో చేరబోతున్నట్లు చెప్పారు. ఆయనతో మరికొంత మంది వైకాపా నేతలు కూడా తెదేపాలో చేరబోతున్నట్లు చెప్పారు. అదే నిజమయితే సర్వేశ్వర రావుతో కలిపి కేవలం నెల రోజుల వ్యవధిలో మొత్తం 9 మంది ఎమ్మెల్యేలు తెదేపాలో చేరినట్లవుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే కొణతాల రామకృష్ణకి టికెట్ ఇచ్చి పార్టీలో చేర్చుకొంతారని ప్రచారం జరిగింది. కానీ అప్పుడూ ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీలో తీవ్రమయిన పోటీ నెలకొని ఉన్నందున ఆయనకు ఆ అవకాశం దక్కలేదని తెలుస్తోంది. మరిప్పుడు ఆయనను పార్టీలోకి తీసుకొంటే ఏ పదవి ఆఫర్ చేస్తారో చూడాలి.