వెంకటేష్ ఎప్పుడు మాట్లాడినా.. దేవుడు, హిమాలయాలు, ఆధ్యాత్మిక చింతన ఇలాంటి టాపిక్కులు వస్తూ పోతూ ఉంటాయి. ఆయన 75వ సినిమాల వేడుకలోనూ ప్రసంగంలోనూ అవే వినిపించాయి. వెంకటేష్ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్’. ఈ సందర్భంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకీ తనదైన స్టైల్ లో మాట్లాడాడు. తన కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయని, ఓ ఫ్లాప్ వచ్చినప్పుడు హిమాలయాలకు వెళ్లిపోవాలని అనిపించేదని, అలాంటప్పుడే తన తోటి హీరోలు ఓ సూసర్ హిట్టు కొట్టి తనలో ఉత్సాహాన్ని నింపేవారని, అందుకే హిమాలయాలకు వెళ్లకుండా మరో సినిమా చేసుకొనేవాడ్నని.. చెప్పుకొచ్చాడు వెంకీ. యువ హీరోలకు కూడా ఓ చక్కటి సలహా ఇచ్చారాయన. ఎక్కువ హైరానా పడితే విజయాలు రావని, కూల్‌గా పని చేసుకుపోవాలని, విజయాలు రావాల్సిన సమయంలోనే వస్తాయని హితవు పలికారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు ప్రసంగం కూడా సరదాగా సాగింది. ”సురేష్ ప్రొడక్షన్స్‌లో ఓ సినిమా చేశాను. అప్పుడే రామానాయడు గారికి ఇద్దరు కుమారులని తెలిసింది. రెండో అబ్బాయి ఎలా ఉంటాడని అడిగాను. ఓ మాదిరిగా ఉంటాడని చెప్పారు. కానీ తను చాలా అందంగా కనిపించాడు. తను సినిమాల్లోకి వస్తాడేమో అని భయపడ్డాను. కానీ తనకు సినిమాలపై ఇంట్రస్ట్ లేదని తెలిసి ఊపిరి పీల్చుకొన్నా. ఆ తరవాత సినిమాల్లోకి వచ్చేశాడు. అప్పటి నుంచీ ఇద్దరం మంచి మిత్రులం అయిపోయాం. కథల ఎంపికలో తన స్టైల్ బాగుంటుంది. అందుకే వైవిధ్యభరితమైన సినిమాలు చేశాడు. తన సినిమాల్లో మల్లీశ్వరి నాకు చాలా ఇష్టం” అని చెప్పుకొచ్చాడు చిరు.