టాలీవుడ్ లో హాట్ టాపిక్.. నవీన్ మేడారం. డెవిల్ సినిమాకి ఆయనే దర్శకుడు. కానీ ఈగో కారణాల వల్ల ఆయన్ని తప్పించి, నిర్మాత (అభిషేక్ నామా) దర్శకుడిగా తనకు తానే క్రెడిట్స్ ఇచ్చుకొన్నాడు. 105 రోజులు షూటింగ్ చేసిన ఓ దర్శకుడికి క్రెడిట్ ఇవ్వకుండా ప్యాచ్ వర్క్ చేసిన నిర్మాత దర్శకుడిగా మారడం – బహుశా టాలీవుడ్ చరిత్రలోనే ఇదే తొలిసారేమో..?
దర్శకుడి పని తీరు నచ్చకపోతే, అతన్ని తొలగించే హక్కు నిర్మాతకు ఉంది. కానీ క్రెడిట్ లాక్కొనే అధికారం ఎవ్వరికీ లేదు. ఇది వరకు `మణికర్ణిక` విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో క్రిష్కీ, కంగనా రనౌత్ కీ మధ్య విబేధాలు జరిగాయి. క్రిష్ పక్కకు వచ్చేశాడు. కొన్ని సీన్లకు కంగనా దర్శకత్వం వహించింది. టైటిల్ కార్డులో కంగనాతో పాటు క్రిష్ పేరు కూడా కనిపించింది. ఇక్కడ మాత్రం దర్శకుడి ప్రస్తావన లేదు.
నవీన్ కూడా క్రెడిట్ విషయంలో బాధ పడ్డాడు. కోర్టు కేసులు, లీగల్ నోటిసుల జోలికి వెళ్లనంటూనే తన కష్టం వృధా అయిపోయిందని బాధ పడ్డాడు. `డెవిల్` విషయంలో జరిగిందేమిటన్నది అందరికీ తెలుసు. తప్పొప్పులు ఎవరివైపున్నా, దర్శకుడిగా నవీన్ కు రావాల్సిన క్రెడిట్ రావాల్సిందే. ఈ విషయంలో దర్శకుల సంఘం మౌనంగా ఉండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. దర్శకుల సంఘం ఇలాంటి పరిస్థితుల్లో కూడా స్పందించకపోవడం, న్యాయం కోసం పోరాడకపోవడం బాధించే విషయం. నవీన్ కంప్లైంట్ చేయలేదు కాబట్టి, మేమేం చేయలేదు అని వాళ్లు సర్ది చెప్పుకోవొచ్చు. కానీ ఓ దర్శకుడికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వలేదని నవీన్ నెత్తీ నోరు మొత్తుకుంటుంటే, ‘మేమున్నాం’ అంటూ దర్శకుల సంఘం ముందుకు రావాల్సిన తరుణం ఇది. అప్పుడే కదా, ఇలాంటి వ్యవస్థలపై నమ్మకం కలిగేది.