నైజాంలో సలార్ రూ.50 కోట్ల మైలు రాయిని అందుకొంది. నైజాంలో ప్రభాస్ సినిమాలకు తిరుగులేదని మరోసారి సలార్‌తో రుజువైంది. నైజాంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కి దగ్గర్లో ఉంది. అయితే.. ఆంధ్రాలో పరిస్థితేమిటి? అనేది ఆరా తీస్తే.. కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. అక్కడ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవడం కష్టమని ట్రేడ్ వర్గాలు ఊహిస్తున్నాయి. నైజాంలో ఫస్ట్ వీకెండ్ లో టికెట్ రేట్లు బాగా పెంచేశారు. మల్టీప్లెక్స్‌లో అయితే టికెట్ రేట్లు డబుల్ అయ్యాయి. దాంతో నైజాంలో బ్రేక్ ఈవెన్‌కి దగ్గర పడిపోయింది. కానీ ఆంధ్రాలో లెక్క వేరు. అక్కడ టికెట్ రేట్లకు, సినిమా కొన్న రేట్లకు గిట్టుబాటు అవ్వడం లేదు.
ప్రభాస్ సినిమాకి ఊహించని ఓపెనింగ్స్ వచ్చినా.. ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సంక్రాంతి వరకూ `సలార్` లాంగ్ రన్ కొనసాగితే, ఆంధ్రాలో బొటాబొటిగా బయ్యర్లు గట్టెక్కుతారు. లేదంటే స్వల్ప నష్టాలతో సర్దుకుపోవాల్సిన పరిస్థితి. ప్రభాస్ లాంటి అగ్ర హీరో సినిమాకి, హిట్ టాక్ వచ్చినా – బయ్యర్లు గట్టెక్కలేదంటే ఆశ్చర్యమే. ఈ భయాలు సంక్రాంతి సినిమాలకూ వెంటాడతాయి. ఎందుకంటే `గుంటూరు కారం`లాంటి సినిమాల్ని కనీ వినీ ఎరుగని రేట్లకు కొంటారు బయ్యర్లు. సంక్రాంతి సీజన్‌పై వాళ్లకు అంత నమ్మకం. అయితే.. ఈ సంక్రాంతి పోటీ మామూలుగా లేదు. రోజుకో సినిమా వస్తోంది. నైజాంలో ఓకే కానీ, ఆంధ్రాలో పెట్టిన రేట్లు మళ్లీ తిరిగి రాబట్టుకొంటారా అనేది డౌటే.