టీడీపీ, జనసేనలను టార్గెట్ చేస్తూ ఆర్జీవీ తీసిన సినిమా ‘వ్యూహం’. ఈ సినిమా వెనుక ఎవరున్నారో, వాళ్ల లక్ష్యం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ప్రేక్షకులూ ఈ సినిమాని చూస్తున్నారు. వ్యూహం చిత్రానికి సెన్సార్ నుంచో, కోర్టు నుంచో సమస్యలు వస్తాయని ముందే ఊహించారంతా. సెన్సార్ నుంచి ఈ సినిమా తప్పించుకొన్నా, న్యాయ స్థానం ముందు దొరికిపోయింది. సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ని జనవరి 11 వరకూ హోల్డ్ లో ఉంచింది తెలంగాణ హై కోర్టు.
నిజానికి ఈ వారంలోనే ‘వ్యూహం’ విడుదల చేద్దామనుకొన్నారు. ఇప్పుడు జనవరి 11 వరకూ ఆ ఊసెత్తడానికి వీల్లేదు. ఆ తరవాత కూడా కోర్టు వదులుతుందని అనుకోకూడదు. నిజంగా టీడీపీ, జనసేన పార్టీ ప్రతిష్టలకు ఈ సినిమా భంగం కలిగించేలా ఉంటే, న్యాయస్థానం తగిన చర్యలు తీసుకొంటుంది. అప్పుడు వ్యూహం మరింత ఆలస్యం అవుతుంది. ఆలోగా ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. అదే జరిగితే ఆంధ్రాలో ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ సినిమా విడుదల అవ్వడానికి వీల్లేదు. ఆ తరవాత.. వచ్చినా, రాకపోయినా పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే..’ఆర్జీవీ వ్యూహం’ దారుణంగా బెడసి కొట్టినట్టే. నిజానికి ఈ సినిమా విడుదలైనా జనం పట్టించుకోరు. ఎందుకంటే వర్మ నుంచి ఎలాంటి కళాఖండాలు వస్తాయో ప్రేక్షకులకు తెలుసు. కనీసం సినిమా విడుదల చేసుకొన్నాం అనే సంతృప్తి కూడా వర్మ అండ్ కోకి దక్కేలా లేదు.