జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జగన్ రెడ్డికి రాసిన లేఖ చదివిన ఎవరికైనా… అయ్యోపాపం అనిపించక మానదు. అందులో చెప్పిన వాటిలో రాజకీయంగా జరిగినదంతా కళ్ల ముందే ఉంది. ఆయన వ్యాపారాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసిన వైనం గురించి ఆయన సన్నిహితులకు తెలుసు. పాము తన గుడ్లను తాను మింగినట్లుగా వైసీపీ నేతల వ్యాపారాన్ని కూడా .. ఆ పార్టీలో పెత్తందారులు దెబ్బతీశారని వంశీకృష్ణ శ్రీనివాస్ లాంటి వాళ్లను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.
తాజాగా వైసీపీ సాధికార బస్సుయాత్రలో పెనుమలూరు ఎమ్మెల్యే పార్థసారధి కూడా దాదాపుగా అదే చెప్పారు. జగన్ రెడ్డి తనను గుర్తించలేదన్నారు. అయినా తాను ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తనను ఓ కులానికి పరిమితం చేయవద్దన్నారు. అన్ని కులాలూ తనను ఆదరించాయన్నారు. పార్థసారధికి జగన్ రెడ్డి టిక్కెట్ ఎగ్గొట్టడమో.. సీటు మార్చడమో చేయబోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్థసారధి బీసీ. కృష్ణాజిల్లాలో మంత్రి పదవికి ఆయనకు మించిన అర్హత ఉన్న వారు లేరు. అయినా ఆయనను పక్కన పెట్టారు. అవమానించారు. అందుకే ఇలా మాట్లాడారు.
వీరే కాదు.. వైసీపీలో పెత్తందారుల దెబ్బకు బీసీ నేతలు రగిలిపోతున్నారు. . కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్, గురజాలలో జంగా కృష్ణమూర్తి ఇలా చాలా మంది ఉన్నారు. జంగాకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇస్తామని ఆశ పెట్టి చివరికి .. కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. వైసీపీలో జరుగుతున్న వ్యవహారాలను చూసిన తర్వాత బీసీలకు ఇవ్వడం కాకుండా.. బీసీలను టార్గెట్ చేసినట్లుగా ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.