ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన బ్రేక్ వేశారు. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఈటల రాజేందర్ పార్టీ మారుతారన్న ప్రాచారం ఊపందుకుంది. కానీ ఆయన మాత్రం అమిత్ షా మీటింగ్ కు హాజరయ్యారు. తన కోరికను బహిరంగంగానే వెలిబుచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తాను మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయనున్నట్లుగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇది బీజేపీలో మరింత వివాదం అయ్యే అవకాశం ఉంది. కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి సిట్టింగ్ నేతగా బండి సంజయ్ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఎంపీ సీటు ఆయనకే లభించే అవకాశం ఉంది. దీంతో ఈటల రాజేందర్ తాను అసెంబ్లీకి రెండో స్థానంగా పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గం ఉన్న మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు.
కానీ ఈటల రాజేందర్ అనూహ్యంగా మల్కాజిగిరి నుంచి పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. దీనిపైనా బీజేపీలో వివాదం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఆయనను సంప్రదాయ బీజేపీ నేతలు దూరం పెడుతున్నారు. అయితే హైకమాండ్ తనను ఆదరిస్తుందని నమ్ముతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలవకపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. బీజేపీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా అన్న సందేహం ఉంది. అందుకే కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైతే ఈటల రాజేందర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.