జనవరి 14- 19 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి మొదటి విదేశీ పర్యటన. ముఖ్యమంత్రి బృందం జనవరి 15న బయలుదేరి జనవరి 18న తిరిగి వస్తుంది. నాలుగు రోజులపాటు జరిగే చర్చల్లో తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై అంతర్జాతీయ వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడనున్నారు.
తెలంగాణ నుంచి ప్రతి ఏడాది ఓ టీమ్ దావోస్ వెళ్తుంది కానీ… ముఖ్యమంత్రి నేతృత్వంలో కాదు. ఐటీ మంత్రి కేటీఆర్ అధికార బృందంతో వెళ్లేవారు. ప్రతీ సారి భారీ ఒప్పందాలను చేసుకున్నట్లుగా ప్రకటనలు వచ్చేవి. గత ఏడాది కేటీఆర్ దాదాపు రూ.21 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారని చెప్పుకున్నారు. ఎంత మేర ఎన్ని వర్కవుట్ అయ్యాయో స్పష్టత లేదు.
ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి వెళ్తున్నారు కాబట్టి మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. విదేశీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, సౌకర్యాలను ఈ బృందం వివిధ కంపెనీల ప్రతినిధులకు వివరించనుంది. ఐటీ, ఫార్మా, బయో, ఏరోస్పేస్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ రంగాల్లో అవలంబిస్తున్న విధానాలు, విదేశీ పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యత తదితరాలను వివరించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కూడా రేవంత్‌రెడ్డితో పాటూ దావోస్ వెళ్లనున్నారు.
ఏపీ సీఎం జగన్ దావోస్ సదస్సును ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. ఒక్కసారే వెళ్లారు. అదీ కూడా విహారయాత్రకు వెళ్లి.. మధ్యలో రెండు రోజులు దావోస్ లో గడిపారు. అక్కడ ఇన్వెస్టర్లు అడిగిన ఓ ప్రశ్నకు.. సమాధానం చెప్పలేక.. లెంగ్తీ క్వశ్చన్ అంటూ బిక్కమొహం పెట్టి ట్రోలింగ్ కు గురయ్యారు. మళ్లీ ఆ వైపు చూడలేదు.