నంది పురస్కారాలపై తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలు చిన్న చూపు చూశాయి. తెలంగాణ ‘నంది’ స్థానంలో ‘సింహా’ అవార్డులు ఇస్తామని చెప్పి, ఆ తరవాత దాని ఊసెత్తలేదు. జగన్ సర్కారు సంగతి సరే, సరి. సినిమా వాళ్లంటేనే ఆ ప్రభుత్వానికి పడదు. అలాంటిది పిలిచి, పురస్కారాలేం ఇస్తుంది. అయితే తెలంగాణలో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ నంది పురస్కారాలు ఇవ్వడం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా ఈ విషయంపై చిత్రసీమకు హామీ ఇచ్చేశారు. వచ్చే యేడాది నుంచి నంది పురస్కారాలు ఇస్తామని, ఈ విషయం సీ.ఎం. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే చిత్రసీమ పెద్దలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధాన అజెండా.. నంది పురస్కారాల గురించే. కేసీఆర్ ప్రభుత్వం ‘సింహా’ అని పేరు మార్చినా.. కొత్త ప్రభుత్వం ‘నంది’ పురస్కారాలన్ని కంటిన్యూ చేయడానికే చూస్తోంది. కొత్త యేడాదిలోనే సీఎంతో చిత్రసీమ భేటీ కానుంది. ఫిబ్రవరిలోగా అవార్డుల గురించి ఓ ప్రకటన రావొచ్చు. పెండింగ్లో ఉన్న నందుల్ని పూర్తిగా పక్కన పెట్టి 2023 నుంచి అవార్డుల్ని ప్రకటించే అవకాశం ఉంది.